Sunday, February 5, 2017

ఇంటిమీదెవుసమ్ 24

                                                     

ఎండాకాలం వచ్చేకంటే ముందే అవకాశం ఉన్న కూరాగాయల  సాగు ప్రయత్నం లో ఈ రోజు గంగవాయిలీ, బెండ, గోరుచిక్కుడు, బీర, కాకర గింజలను నాటుదామని ఇంటిమీద  మడులను సిధ్ధం చేస్తున్నాను. శీతాకాలం ప్రారంభం లో పెట్టిన టమాటా చెట్లు ఇంకా కాస్తున్నయి . . నేను తలవంచుకొని నా పనిలో నేను నిమగ్నమై ఉన్నాను.

పక్కింటామే చూచూ ! కోతులు పాడుగాను అన్నం గంజు ఎత్తుకొని పోతున్నయని కట్టే దీసుకొని కోతివెంట బడ్డది . కోతి అదురక బెదురక నోరుదెరిచి నోట్లే కోరలు బైటికి వెళ్లబెట్టి గుర్ గుర్ అనుకుంటా ఆమెను బెదిరిస్తున్నది. ఇంతల మరో వైపు నాలుగైదు కోతులు వచ్చి అన్నం గంజును ఖాళీ జేసినై. ఆమె కేకలకు ఆమె భర్త ఇంకో కట్టేవట్టుకొని వస్తుండంగానే వాళ్ళ గోడ దునికి మా కాంపౌండు లోకి వచ్చినై. వస్తువస్తూనే టమాటా పందిరి పైన దునికి చేతికి అందిన పండ్లు కోసుకొని పరిగెత్తుకొని గోడ అవతల పెట్టుకొని విందు భోజనం తీరుగా అన్నీ కల్సీ తింటున్నై.

వీటి బాధ పడలేక కొనిపెట్టుకున్న గులేర్ ( వై ఆకారం లో ఉండే రబ్బరుతీగెల ఉండీల ) తీసుకొని వాటి గుంపు పైన గురి పెట్టిన. చెట్టు చాటుకు, గోడ చాటుకు దాక్కొని వచ్చే గులుక రాళ్ళను కాచుకొని చూస్తున్నై. రెండు మూడు సార్లు రాళ్ళను వాటి పైకి రువ్వంగానే పారి పోయినై. మళ్ళీ నేను నా పని లో నిమగ్న కాంగానే ఎట్లా కనిపెడుతున్నాయో గాని వాటి సయ్యాట మళ్ళీ మొదలైతున్నది . నేను గులేర్ తియ్యంగానే ఉరుకుడు, నేను పని మొదలు పెట్టంగానే మల్లా వచ్చుడు. నన్ను ఆటాడుకుంటున్నై. కోతి చేస్టలు వివేకవంతమైనవా , పిచ్చివా అని బేరెజు వేయడం అయ్యే పనిగాదు .

ఐతే ఈ మధ్యన మా వార్డ్ కార్పొరేటర్ ఒక మీటింగ్ పెట్టి దొంగలు, ఆవారాగాళ్ళు, చైన్ స్నాచర్లు , రెచ్చిపోతున్నారు కనుక సి సి కెమెరాలు పెడుతాం కాంట్రిబ్యూషన్ కావాలని చెప్పిండు. వాస్తవానికి పోలీసుల వద్ద వాళ్ళ రేటింగ్ కోసం నాయకులు, పెద్ద అధికార్ల దగ్గర రేటింగ్ కోసం పోలీసులు ఆడుతున్న నాటకం అది . సరే అది మన ప్రస్తుత చర్చనీయ అంశం కాదుగానీ దొంగలు, చైన్ స్నాచర్ల కంటే కోతుల బెడద ఎక్కువ అని నేను చెప్పినప్పుడు దాన్ని కూడా పరిష్కరిద్దామ్ అన్నాడు మా కార్పొరేటర్..

ఒక వైపు కోతుల తో నా కొట్లాట సాగుతుండగానే మా ఇంటి పక్కనున్న చెట్టుకిందకు ఒక వ్యాన్ వచ్చి ఆగింది. దాని డ్రైవర్ కొన్ని మక్కజొన్నలను ఆ వ్యాన్ లో చల్లుకుంటూ కోతులను ఆవ్ ఆవ్ అని ఆహ్వానిస్తున్నాడు. దూరం నుండి చూస్తున్నై కానీ దగ్గరకు రాలేదు ఏవీ కూడా. అతడు దూరంగా వెల్లంగానే మెల్ల మెల్లగా పిల్ల కోతులు భయపడుకుంటా భయపడుకుంటా వచ్చి వ్యాను ఎక్కినై. లోపల టాప్ కు కట్టిఉన్న మక్కవెన్నులకు ఊగులాడుతున్నై. దిగిపోతున్నై . ఒక సారి పెద్ద కోతి వచ్చింది గేట్ దాకా వెళ్ళి కేర్ మని అరిచి కిందికి దునికింది. ఒక్క సారి అన్నీ దునికి వెళ్ళి పోయినై. అవి ఇట్లా ఆటాడుకుంటూ ఆటాడుకుంటూ నమ్మకుండా నే తేపకోసారి వచ్చి  వేసిన గింజలు అన్నీ తిని పోయినై.

" ఆకారాణంగా ఒక వ్యక్తి నీ పై అతి ప్రేమ చూపుతున్నాడంటే అతడు నిన్ను మోసం చేయడానికే " అని ఆ కోతులు గ్రహించాయి. కానీ బుధ్ధీ , జ్ఞానం మాకే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న ఈ తరం యువతరం , ప్రేమ పేరుతో, ఈజీ మని పేరుతో రకరకాల ఆకర్షణలకు లోబడి   సాలె గూడు లాంటి సమస్యల్లో ఇరుక్కు పోతున్నారు.

No comments:

Post a Comment