Wednesday, February 15, 2017

ఇంటిమీదెవుసమ్ 27

                                               

చాలా రోజుల తర్వాత మిత్రుడు బెజ్జారపు రవీందర్ తాను ఈ మధ్యన రాసిన " తాటక " నవల నాకు ఇవ్వడానికి వచ్చిండు. ఆ పుస్తకానికి తాను రాసిన ముందుమాట ఆదివరకే చదివి ఉన్నాను కనుక ఆర్యుల, ద్రావిడుల , గురించిన చర్చ జరిగింది . ఐదు వేల ఏండ్ల కిందటి నుండే నగర జీవులైన ఆర్యులు , ద్రావిడుల నుండి అడివిని ,  భూమిని గుంజుకొనే ప్రయత్నం సాగుతుంటే , అడువులను , భూమిని వదులుకోవడానికి సిద్ధంగా లేని ద్రావిడుల  లేదా అసురుల , ప్రతిఘటనే రామాయణ కథ అని అనుకున్నాం .

రవీందర్ వెళ్ళి పోయిన తర్వాత పాత జ్ఞాపకాల దొంతర నా మనుసులో మల్లొక్కసారి కదిలింది. 1980 వ దశకం చివర్లో అనుకుంటా మేము రాయికల్ లో ఒక మండల విద్యా మహా సభ నిర్వహించినమ్. ఆ సభ నిర్వహణ బాధ్యతను ఇద్దరు వ్యక్తులు స్వీకరించిండ్రు. ఒకరు మా సంఘం మండల శాఖ ప్రధాన కార్యదర్శి ముప్పాళ రాంచెందర్ రావ్ అయితే మరొకరు మా సంఘం అధ్యక్షులు బెజ్జారపు శంకరయ్య సార్. మహా సభలకు ఎంత మంది వస్తారు, వారికి భోజన వసతి సౌకర్యం కలిపించడం, సభల నిర్వహణకు వేదిక, సభలో మాట్లాడే అంశాలు, ఆయా అంశాలను ఎవరితో మాట్లాడిద్దామ్, ఈ పనులన్నిటికి అవసరమైన ఆర్థిక వనరులు ఎట్లా సేకరిద్దామ్ అన్న విషయాలను కార్యరూపం లో పెట్టడానికి నేను నాలుగైదు రోజుల  ముందుగానే రాయికల్ కు వెళ్ళిన. అప్పటికే శంకరయ్య సార్ తో పరిచయం ఉన్నా సాన్నిహిత్యం పెరిగింది మాత్రం ఇగో ఈ సభల సందర్భం లోనే !  అక్కడ ఉన్నన్ని రోజులు నా భోజనం ఎక్కువ సార్లు శంకరయ్య సార్ ఇంట్లోనే. అప్పటికి నాకు రవీందర్ తో  పరిచయం లేదు. ఆ సందర్భం లో ఆయన అక్కడ లేకుండెనో ఏమో కూడా. అయితే శంకరయ్య సార్ అప్పడు తాను నైజాం కాలం లో ఉర్దు మీడియం లో చదువుకోవడానికి ఎంతెంత  కస్టపడ్డది చాలా వివరంగా చెప్పిండు. శంకరయ్య సార్ వాళ్ళ నానా ఎవరో ఒక పట్వారీ వద్ద గుమాస్తా గా పనేజేసేవాడట . ఆ సంస్కారం వలన , వాళ్ళ నాన్న శంకరయ్య సార్ ను జగిత్యాల లో చదివించిండట  దొరలు నావాబుల పిల్లలు గ్రామాల నుండి వచ్చిన పిల్లలను కొట్టి తిట్టి ఏడిపించేవాల్లట. పలకను పగులగొట్టడం, పుస్తకాలను చించివేయడం, నోరు తెరిచి ఎందుకు ఇట్లా అంటే వీపుపగుల గొట్టడం వాళ్ళకు సరదా ఆటలట . అన్ని  కస్టాలు పడి నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకొబట్టే ,  ఇగో ఈ బడి పంతులు నౌకరీ వచ్చిందని చెప్పిండు. ఒక డెబ్బై ఏండ్ల కిందటి వరకు కూడా వెనుకబడిన వాళ్ళ చదువుల పట్ల ఎంతటి  అణిచివేత ఉండేదో అర్థం జేసుకుంటే దప్ప ఇంతవరదాకా వీళ్ళందరూ ఎందుకు ఇంతటి  పేదరికం లో  మగ్గి పోయారో అర్థం కాదు. దళితులకైతే అప్పటికి ఇంకా అక్షరాబ్యాస భాగ్యం లభించి నట్టే లేదు ఈ ప్రాంతం లో .

ఆ సందర్భం లోనే రాయికల్ పక్కన్నే ఉన్న ఇటిక్యాల గడీని చూసిన . చుట్టూ చాలా ఎత్తైన ప్రహారీ గోడ, పెద్ద ప్రవేశ ద్వారం . దానికి ఇరుపక్కల దొర దర్శనం కోసం వచ్చిన వాళ్ళు నిలిచి ఉండే స్తలమ్ , ప్రవేశ ద్వారానికి ఈశాన్యం మూలన ఒక పెద్ద బావి, దానికి ఎత్తైయన రెండు పంతెకొక్కులు ( మోట కొట్టడానికి ఉండే చిమ్ములు ) ఇంకా ఆ కాలం రాజసానికి చిహ్నంగా చీకిపోయి   ఐనా నిలిచిఉన్నై. ఆ బావి నీరు ను ఒంటెల తోటి పైకి మోటకొట్టించి ప్రహరీ గోడ పైన కట్టి ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ లకు నింపి నల్లాలు తింపుకొనే వాల్లట . ప్రహారీ గోడను ఆనుకొని గుర్రాల శాల ఉంది. రకరకాల గుర్రపు బగ్గీలు పైన వేలాడ దీసి ఉన్నై . లోపలికి వెళ్తుంటే ఇరుపక్కల ఇరాన్  నుండి తెప్పించిన సిరామిక్ నగిషీల పలకలు  అతికించి ఉన్నాయి. పెద్ద పెద్ద కడపలు, దర్వాజాలు ఉన్న నివాసపు గదులు, చాలా పెద్ద వంటశాల , భోజన శాల ఉన్నాయి. ఆ వెనుక ఒక పెద్ద దిగుడు బావి , ఈతకొలను ఉంది, అందులో తామర పువ్వులు ఉన్నాయి. ఎంత రాజసమో కదా అని అబ్బుర పడ్డాము . 1980 వరకు కూడా ఆ ప్రాంతం లో ఎమ్మెల్లెగా, ఎంపీగా పోటీ జేసె అభ్యర్థులు  ఎవరైనా ఆ దొర గడీ ముందు చేతులు జోడించి నిలబడి తాము అనుజ్ఞ ఇస్తే గ్రామాలల్లో ప్రచారం చేసుకుంటా మని వేడుకొనే వారట. జగిత్యాల జైత్రయాత్ర తర్వాతనే ఆ గడీ గోడలకు బీటలు వారినై అని చెప్పిండ్రు. ఒక వైపు శత్రు దుర్బెధ్యమైన కోట గడీలు, మరో వైపు అయ్యా బాంచెన్ అనే కూలీ నాలీ జనాలు. అంతటి అసమతుల్యం కారణంగానే ఇక్కడ రైతాంగ తిరుగుబాటు జరిగింది.

రామాయణ కాలం లో అసురుల నివాసాలైన అడువులను గుట్టలను యజ్ఞ యాగాదుల పేరుతోటి నాగరీకరించి ఫణి పుంగవుల వ్యాపార అంగళ్ళ కొరకు అయోధ్యలాంటి నగరాలు నిర్మిస్తే, ఇప్పుడేమో అభివృద్ధి పేరు తోటి , ప్రజలు నివసిస్తున్న , వ్యవసాయం చేస్తున్న సుసంపన్నమైన భూములను ప్రభుత్వం ఆక్రమించి , ప్రాజెక్టులు ఓపెన్ క్యాస్ట్ మైన్స్, సెజ్జులు, క్వారీల కోసం సంపన్నులకు ధారాదత్తం చేస్తున్నారు.  రాజ్యాలు మారినై, దోపిడి రూపాలు మారినై కానీ రాజ్యం అనేది ప్రజల శ్రమను పీల్హుకోవడం అనేది మారలేదు , అని మనుసుల అనుకుంటున్న , బైట ఎవరో తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది .  

No comments:

Post a Comment