Wednesday, February 8, 2017

ఇంటిమీదెవుసమ్ 25

                                                 

కరీంనగర్ పట్టణానికి కూరగాయలు సరఫరా జేసిన  గ్రామాలల్లోఒకనాడు  నీలోజీ పల్లెది పెట్టింది పేరు. మానేరు నది ఒడ్డున ఆ గ్రామం ఉండడం ఆనాడు ఆ గ్రామానికి వరమైతే మిడ్ మానేరు డ్యామ్ కట్టుడుతోటి మానేరు  నది ఒడ్డున ఉండడం ఆ గ్రామానికి ఇప్పుడు శాపం అయింది. డ్యామ్ కడుతున్నం మీ గ్రామం ఖాళీ జేయాలే అని పబ్లిక్ ఒపెనియన్ మీటింగ్ రోజున మేము కూడా పోయి ఉంటిమి . ఆ నాడు రైతులంతా మాకు భూమికి బదలు భూమి ఇవ్వాలే అని పట్టుబట్టిండ్రు . మీటింగ్ నడువనియ్యమని గొడవ గొడవ చేసిండ్రు.

తోట  రాజలింగు అని ఒక  పెద్దమనిషి ముందుకు వచ్చి "  అయ్యా ! కలెక్టర్ సాబు , మా తాత ఇరివై ఎకురాల ఆసామి ,  ఇద్దరు అక్కలకు ఆ భూమి ఆసరా తోటి పెండ్లిల్లు చేసిండు. మేమిద్దరం అన్నదమ్ములమ్ మాకు పెండ్లిల్లు జెసి సెరి పదేకురాలు పంచి ఇచ్చిండు. నాకు ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డే. ఈ భూమి ఆసరా ఉన్నదన్న ధైర్యం తోటి నేను నా కొడుకులను బిడ్డేను చదివిచ్చుకుంటాన. రేపు వాళ్ళ పెండ్లిల్లు పెరంటాలు జెసి పంపుత అన్న ధైర్ణం తోటి ఉన్న.అంతా అయినంక నా కొడుకులకు తలా అయిదేకరాలు పంచి ఇస్తా కూడా . కానీ ఇప్పుడు ఈ భూమి గుంజుకొని మీరు డబ్బులు ఇస్తే అరిసేతుల పెట్టుకున్న ఐసు ముక్క తీరుగా ఆ డబ్బులు కరిగి పోతై , రేపు నా పొల్లగాండ్లకు భూమి ఉండది . భరువస లేని బతుకులై పోతై . దండం బెడుతం మా భూములంతుకు భూములే ఇయ్యలే" అని ఒక్కతీరుగా బతిమిలాడిండు . కానీ పోలీసులను పెట్టి మీటింగ్ అయ్యింది అనిపిచ్చుకొని వెళ్లిపోయిండ్రు.

గత ఐదు వేల సంవస్తరాల నుండి ఏ నాగరికతలను పరిశీలించినా గుట్టలు , అడవులు కలిగిన నది ఒడ్డు వెంటనే జనావాసాలు వెల్లివిరిసినట్టు చరిత్ర చెపుతున్నది. కానీ ఇప్పుడేమో గుట్టలను కూల్చివేస్తూ, అడవులను నరికి వేసి నది ఒడ్డు గ్రామాలను ఖాళీ చేయించి అభివృధ్ధి నమూనా అంటే ఇదే అంటున్నారు. ప్రజల అభిప్రాయం తో సంబంధం లేకుండానే నీలోజీ పల్లె ఖాళీ అయింది .

మొన్న ఒక పని పైన కొదురు పాక వెళ్ళిన . పక్కనే ఉన్న నీలోజీ పల్లె ఎట్లున్నదో చూద్దామని వెళ్ళిన.వానా కాలం ప్రారంభం లోనే డ్యామ్ లో నీళ్ళు ఆపుతున్నాం ఇండ్లు మునిగి పోతాయని చాటింపువేసి ఊరును ఖాళీ చేయించిండ్రు. వాళ్ళు చెప్పినట్టే నీళ్ళు వచ్చి ఊరు మునిగి పోయింది. విపరీతమైన వర్షాల మూలంగా  నీళ్ళు బాగా వచ్చి డ్యామ్ కట్ట తెగిపోయింది .ఆ తర్వాత  మునిగిన ఇండ్లు తేలినై కానీ , అన్నీ నీళ్ళు నిలిచినప్పుడు కూలి పోయినై . . .ఇప్పుడు నీళ్ళు లేక డ్యామ్ ఎండిపోయి ఉంది. నీళ్ళు లెవ్వు కనుక ఆ భూములను సేద్యం చేసుకొని కూలిన ఇండ్లను శుబ్రమ్ చేసుకొని ఉంటున్నరు కొందరు. తోట రాజలింగు ఉన్నడేమో చూద్దాం అని ఇల్లు వెతుక్కుంటూ పోయిన. చీకిపోయిన పైకప్పు తో జీర్ణావస్తలో ఉన్న ఇంట్లో నుండి బైటికి వచ్చి "ఎవ్వలు సారు మీరు "  అన్నడు . నా పరిచయం చేసుకున్నా .

" అయ్యో సారు ! కూసుండవెదుదామంటే కుర్సీ లేదు, మంచం లేదు." అనుకుంట చేతులు పిసుక్కుంటున్నడు. బాధతో .
" మర్యాదల కోసం రాలేదు బాపు .ఎట్లున్నరో చూసిపోదామని వచ్చిన " అన్న . గాయింత మాటకే తడిసి ముద్దైండు పెద్దాయన .భూమికి నస్టపరిహారంగా ఇచ్కిన డబ్బులతోటి బిడ్డే పెండ్లి చేసిండట .కొడుకులకు పెండ్లిల్లు అయినయట . మిగిలిన డబ్బులు  కొడుకులు చెరిసగం తీసుకున్నరట  . ఇండ్లు మునిగి పోతున్నై అని చెప్పినప్పుడు కరీంనగర్ ల ఇల్లు కిరాయికి తీసుకొని ఉన్నరట .కరీంనగర్ లేబర్ అడ్డా కాడా రోజు కులీకి పొయ్యేటోడట. ఒక్క తెలిసిన మొఖం గూడా కనిపిచ్చేది కాదట. డ్యాం కట్టదెగి ఊరు తేలిన తర్వాత అక్కడ కిరాయి ఇండ్లల్ల ఉండలేక మళ్ళా ఇక్కడికే వచ్చి ఉంటున్నరట పెద్దమనుషులైన భార్యాభర్తలు . డబ్బులు మాత్రమే ఇచ్చి తమ బాధ్యత అయిపోయిందని ప్రభుత్వం చేతులు దులిపేసుకున్నదట .

"ఉందామంటే ఎక్కడా ఇల్లు లేదు. చుట్టాలు పక్కాలు ఒక్క నాడంటే ఏమనుకోరేమో ఎల్లకాలం వాళ్ళ వద్ద ఉండలేము , తుపాకి దెబ్బకు  బెదిరి ,  చెట్టుమీది నుంచి లేసి పోయిన పిట్టల లెక్క , ఊరు ఖాళీ అయిన తర్వాత ఊరుకొక్కరం అయినం . ఎవ్వరూ ఎక్కడ ఉన్నది తెలువది . ఓ మాట లేదు ముచ్చట లేదు. కరెంటు లేదు, మా బతుకుల తీరుగనే ఉరుకు తొవ్వ లేదు దారి  లేదు . మమ్ముల మంచిగున్నావా అన్న మానవుడు లేడు .

No comments:

Post a Comment