Thursday, February 2, 2017

ఇంటిమీదెవుసమ్ 23


మొన్న పరుచూరి విధాత్రి మా ఇంటిమీదెవుసమ్ తోట  చూసేతందుకు వచ్చినప్పుడు అందరం కలిసి ఇక్కడనే మరో మిత్రుడు సూదమ్ రమేశ్ మిద్దె తోటను వెళ్ళి చూడాలని అనుకున్నం. అనుకున్న ప్రకారం మొన్న సాయంత్రం నా భార్య లక్ష్మి నేను విధాత్రి వాళ్ళ  ఇంటికి వెళ్ళినమ్. అది కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ప్రశాంతి నగర్ కాలనీ లో హౌసింగ్ బోర్డ్ వాళ్ళు కట్టించిన చిన్న మిద్దె ఇల్లు. ఇల్లు చాలా నీట్ సర్ది ఉంది. ఇంట్లోకి వెల్లంగానే ఆతృత కొద్ది మిద్దె  మీదికి ఎక్కినమ్, అక్కడ చూడంగానే వల్ల అభిరుచికి ఫిదా అయినమ్. స్తలమ్ చిన్నదే అయినా అందులో పెట్టిన మొక్కలు అనేకం. మరువం, మందారం, ఆకు కూరలు, సోంపు ఆకు మొక్క, దాల్చిన చెక్క నమిలితే ఎలాంటి రుచో అదే రుచి ఉన్న దాల్చిన మొక్క, టమాటా, వంకాయ, బొప్పాయ, మల్టీ విటామీన్ మొక్క, కళ్యామాకు, మునగ, తో బాటుగా తమలపాకుల చెట్టు, అబ్బా ఎన్ని మొక్కలని . చాలా అబ్బురం అనిపించింది.

విధాత్రి మాటల సందర్భంగా వాళ్ళ నానమ్మ వస్తే ఎన్నెన్నికొత్త  మొక్కలు వాళ్ళ ఇంట్లో పురుడు పోసుకుంటాయో పూసగుచ్చినట్టు చెప్పింది. వాళ్ళ కుటుంబాలల్లో  చుట్టాలిండ్లకు వెళ్లినప్పుడు వాళ్ళ మధ్యన జరిగే సంభాషణ ఎట్లా ఉంటుందట కదా అంటే, " మీ ఇంట్లో ఈ మధ్యన ఏమి కొత్త మొక్కలు నాటారు , ఏమి కొత్త పుస్తకాలు కొన్నారు, ఏమి కొత్త పుస్తకాలు చదివారు " ఇదీ ఇలా ఉంటుందట వాళ్ళ సంబాషణ . నాకు చాలా ఆనందం వేసింది. సామాన్యంగా ఇప్పటి ట్రెండ్ ఏమి కొత్త సినిమాలు చూశారు, ఫలానా సీరియల్ లో ఫలానా పాత్ర ఉంటుందే , అది ఏ పాత్రను చంపుతుంది? ఎవరిని పెళ్ళాడుతుంది , ప్రేమించిన వాన్నా లేక ఇంటికి వచ్చిపోయేవాన్నా అని ఒక అనాగరిక మైన అవాంఛనీయమైన చర్చలు జరుగుతున్న రోజుల్లో , ఒక ఆరోగ్యకరమైన , విలువలు కలిగిన  సమాజం కోసం ఎలాంటి చర్చలు జరుగాల్సి ఉందో తెలియజెప్పిన విధాత్రి కుటుంబానికి బంధు మిత్రులకు అభినందనలు చెబుదాం .

అంతకు ముందే వాళ్ళ ఇంటినుండి రెండు సార్లు రెండు రకాల  దుంప బచ్చలి ఇచ్చిండ్రు. ఇవ్వాళ మా ఇంట్లో అదే కూర, ఐతే నేను వాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు మరో బహుమతి ఇచ్చారు, అదే తమలపాకుల మొక్క మరియు సోంపు మొక్క. రెండూ ఏనుకూన్నై మా దోస్తాన్ తీరుగానే. కొన్ని కూరగాయల విత్తనాలు కూడా తీసుకొని అయిదుగురం కల్సీ తీగలగుట్ట పల్లి లో ఉన్న సూదమ్ రమేశ్ ఇంటికి పోయినమ్. వాళ్ళ భైరవుడు ఉగ్రరూపుడై  తన అనుమతి లేకుండానే ఏమిటీ ఈ  ఆగమనం అంటూ ఆగమాగం జేసిండు   కాసేపు. ఆ తర్వాత చాలా కూల్ అయ్యిండనుకోండి . రమేశ్ మిద్దె తోటలో కాలీఫ్లవర్, టమాటా, వంకాయ చెట్లు , నిలువు పందిరికి పాకి ఉన్న బచ్చలి తీగెలను చూశాం. అప్పటికే చీకటి  పడింది.

రమేశ్ ఇంట్లో టీ తాగిన తర్వాత వాళ్ళ చిన్నమ్మాయి గాయిత్రి తో మాటలు కూడా చాలా కుతూహలంగా సాగినై. మా వెంట ఉన్న విధాత్రి,  గాయిత్రి పేరు వింటేనే అంత్య ప్రాస ను గుర్తుజేసింది  మాకు.  గాయిత్రి పదవ తరగతి చదువుతున్నది . టెన్ బై టెన్ సాధన గురించి బడిలో జరుగుతున్న కసరత్ గురించి చాలా జాలీ గా చెప్పింది. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే ఆ విద్యార్థులను ఎవరిని కదిలించినా ఆబ్బబ్బ చచ్చి పోతున్నాం బాబూ ఈ రుద్దుడు తో అనే వాళ్ళే గాని స్పోర్టివ్ గా తీసుకుంటున్న వాళ్ళు తక్కువ.

ఏమి చదువుదామనుకుంటున్నావంటే చాలా స్పస్తంగా , దృఢ నిర్ణయం తో సివిల్స్ అంది.  చాలా విషయాలు అడిగి తెలుసుకుంది. సివిల్స్ కోసం ఏమి డిగ్రీ చేస్తే సరే అనీ, ఎట్లా చదువితే తను సివిల్స్ సాధించ గలనూ అని చాలా కుతూహలం కనబర్చింది . ఆమె విశ్వాసం నన్ను ఆనందింప  జేసింది. ఎందుకంటే అదే రోజు ఉదయం నాతో వాకింగ్ జేసె ఒక తండ్రి ,  తన కొడుకు హైద్రాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడని వాడు రేసింగ్ బైక్ కొని ఇస్తేనే కాలేజీకి వెళ్తానని లేకుంటే వెళ్ళేది లేదని నెల రోజులుగా ఇంట్లోనే భీష్మించుక కూర్చున్నాడని అబ్బాయి చదువు పట్ల చాలా ఆవేదన వ్యక్త పరిచిండు . తన వలె తన కొడుకు తక్కువ చదువుతో తక్కువ సంపాదనతో సరిపెట్టుకోవద్దని పెద్ద ఉద్యోగం జెసి గొప్పగా బతుకాన్నని తన పిల్లోన్ని చిన్నప్పటి నుండే హైద్రాబాద్ లో ఏ క్లాస్ ఇంగ్లీష్ మీడియం బడిలో హాస్టల్ లో ఉంచి చదివిస్తున్నా అన్నాడు.

నాకైతే ఇక్కడ తండ్రి దే తప్పని అనిపించింది . తన పిల్లని సామర్థ్యం, వాని అర్హత, అవగాహన స్తాయి గమనించకుండా మరీ ముఖ్యంగా ప్రైవేట్ ఇంగ్లీస్ మెడియమ్ రెసిడెన్సియల్ స్కూల్లో వేస్తే మనం ఏది కోరుకుంటే పిల్లోడు అది అవుతాడని అనుకోవడం పిల్లల తలిదండ్రులు చేస్తున్న పెద్ద పొరపాటు. అలాగే చదువు ఉన్నా లేకున్నా ఈ తలిదండ్రులు అనే వాళ్ళు బాగా సంపాయించి తన పిల్లలు తనకంటే ఇంకా ఎక్కువ సంపాయించాలని అనుకోవడం వలన సమాజానికి చెడు సంకేతాలు వెళ్ళి సమాజం చెడిపోవడానికి ఈ పెద్దలే దోహద పడుతున్న విషయాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే సమాజానికి అంతమంచిది. .రమేశ్ కూతురు గాయిత్రి  ఎందుకు అంత బాధ్యతగా ఆలోచిస్తున్నది, అదే  ఆ ఇంజనీరు పిల్లోడు ఎందుకు అంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాడో బుధ్ధి జీవులంతా ఆలోచించాల్సిన విషయం.

No comments:

Post a Comment