Wednesday, February 22, 2017

ఇంటిమీదెవుసమ్ 29

                                                   

" మనం కూరగాయలు పండించాలంటే మనం నడుం వంచాలి " . నానాజీ , రూఫ్ గార్డెన్ , (చీడ పీడ) వాట్స్ అప్ గ్రూప్.

ఎవరికైనా ఏ పనికైనా ఈ సూత్రం వర్తిస్తుందని అనడానికి నా అనుభవం చెపుతాను చదువండి.  1973 లో కరీంనగర్ ఎస్సారార్ డిగ్రీ కాలేజీ లో బి ఎస్సీ కాంగానే గణిత ఉపాధ్యాయుల కొరత వలన మాకు బి ఎడ్ లేకుండానే 150 రూ: వేతనం పైన మా బ్యాచీ లో చాలా మందిని   హాఫ్ ఏ మిలియన్ స్కీమ్ కింద ఎంపిక జెసి , వేతనం తక్కువ కనుక ఎవరి ఊరికి సమీపాన వారిని  టీచర్లు గా నియమించిండ్రు.  అట్లా నాకు మహాదే పూర్ సమితి లోని మా ఊరు ధన్నవాడ పక్కనే ఉన్న గంగారం హైస్కూల్లో పోస్టింగ్ వచ్చింది . నా వయస్సు అప్పుడు 21 . నా విద్యార్థులు నా కంటే అయిదారెండ్లు చిన్నవాళ్లు. కనుక మేమంతా దోస్తుల లెక్కనే ఉందుము. పొద్దుగాల పది నుంచి మాపటీలి నాలుగున్నర దాకా లీజర్ అన్నది లేకుండా పాఠాలు చెప్పుడు. చుట్టి అయిందంటే పిల్లలు మేము కలిసి వాలీ బాల్ ఒక రోజైతే బాల్ బ్యాట్మెంటన్ మరో రోజు ఆరు గంటల దాకా ఆడుకునుడు. చాలా ఖుషీ గా సాగిపోతున్న  రోజులు.  

అప్పటిదాకా ఆ బడికి హెడ్ మాస్టర్ గా ఉన్న శ్రిపెరంబుదూరు శీనయ్య సార్  బి.ఎడ్ . ట్రెనింగ్ చేయడానికి వరంగల్ వెల్లిండు. కానీ ఆయన భార్యా పిల్లలు మాత్రం గంగారం లోనే ఉండే వాళ్ళు. అప్పుడు వాల్లకు వేతనం ఇచ్చి ట్రెనింగ్ పంపిండ్రు. ఆయన ట్రెనింగ్ సహచరులు  ,  కాల్వ శ్రీరామ్ పూర్ మండలం  మల్యాల లో పనిజేస్తున్న  రాపోలు రవీందర్ రెడ్డి  , కరీంనగర్ జిల్లా  ఎలిగేడు లో పనిజేస్తున్న ముప్పాళ లక్ష్మణ్ రావు లు .ఆయన వేతనం తీసుకోవడానికి వచ్చినప్పుడల్లా ఓరుగల్లు పోరు ముచ్చట్లు చెప్పేటోడు . చాలా ఉత్సాహంగా ఉండేటియి . కానీ మా నాయిన నన్ను 1962 ల  ఆరో తరుగతికి మంతెనకు పంపే టప్పుడు , ఆ తర్వాత నా మనుసు పక్క తొక్కుల్లు తొక్కినప్పుడల్లా  ఆయన చెప్పిన మాటలు ఎప్పుడు నన్ను కట్టిపడేసెటియి . " కొడుకా ! మా నాయిన వందెకురాల భూస్వామి, కానీ ,ఆయినను కాదని  నేను కట్టుబట్టల తోటి , భుజాన మొకేసుకొని కలువచెర్ల విడిచి ఈ ఊరు ధన్నవాడ కు వచ్చిన. నా స్వంత కస్టమ్ తోటి మిమ్ములందర్నిగౌరవంగా  సాదుకోస్తున్న. మొన్న చూసినవ్ గదా! రాధకిస్టయ్య(మాజీ స్పీకర్ శ్రీపాద రావు తండ్రి) పంతులు తోటి పీవీ సాబు ( మాజీ భారత ప్రధాని, అప్పుడు మంథని ఎమ్మెల్లే. పోటీదారు )మనింటికి వచ్చి అందరి ఓట్లు వేపించుమని  అడిగిండంటే నేను అందరితోటి మంచిగా ఉండేపటికేనే గదా?  ఇసోంటోల్ల తోటి కూడా మంచిగ ఉండాలే . లేకుంటే  బతుకుడు కస్టమ్ .   కనుక ఏ పంచాయితీలకు పడావులకు పోవద్దు, నీ పనేన్దో నువ్ జేసుకో . ఎవ్వని మీద ఆధార పడకుండా బతికే బతుకు దెరువు సంపాయించుకో . నీ బాధ్యత నువ్ వంద శాతం సరిగ్గా  నిర్వహించి ఈడు సరేరా అనిపించుకునే బతుకు బతుకు . ఎండ్ల ఏలు వెట్టినా కాలి పోతవు . నిన్నెవ్వడు కాపాడాడు , , అని చాలా గట్టిగ చెప్పిండు. ఆ మాటలు  1979 లో ఆయన  చనిపోయే దాకా నా పైన చాల ప్రభావాన్ని చూపినై .

  అది అప్ గ్రేడెడ్ హై స్కూల్ . ఆరుగురు సార్లం, ఎనిమిది తరగతులు , 350 మంది పిల్లలు. శీనయ్య సార్ ప్రభావం వలన   చదువు ఇక్కడ బాగా చెప్పుతరని, గొప్ప పేరు ఉన్నందున ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వద్దురు. తరగతి గదులు చాలి నన్ని లేకుండే. ఒక రోజు ఊల్లే పెద్దమనుషుల తోటి మీటింగ్ పెట్టినం. రెండు పెద్ద పెద్ద కొట్టాలు వెయ్యాలే అని  అనుకున్నం ,  మరి ఎట్లా వేసుడంటే ,  ఇంటికి ఒక్క మంచె రగడు, ఇయ్యాలే , పరాయి ఊర్లళ్లనుంచి వచ్చేవాళ్ళు వడ్లోల్ల కూల్లు భరించే టట్టు నిర్ణయం జరిగింది. ఆది వారం నాడు పెద్ద పెద్ద  పిల్లలను వెంట దీసుకొని ఆరుగురం సార్లం ఇంటింటికి దిరిగినమ్. అప్పటిదాకా ఆ గ్రామాలల్లో మాగి జొన్న అని తెల్ల జొన్నలు పండిద్దురు . అప్పటికి అవ్వన్ని అడివంచు ఊళ్ళు కనుక జొన్న కంకులు తినడానికి రామ చిలుకలు , గోర్రెంకలు , దుబ్బురు పిట్టలు, జక్కోరుగాళ్ళు, ఊరువిసికలు బొమ్మానంగా వచ్చేటియి . వాటినుండి కావలికి చేనుకు ఒకటి లేదా రెండు మంచెలు వేద్దురు . కనుక ప్రతి ఇంట్ల గెల్లాలకు మంచ రగడులు అనే ఈ వాసాలు ఉండేటివి. ఇగ మాకు ఊరి పెద్దల లైసెన్స్ ఉన్నది గదా ? ఊళ్ళోళ్ళకు కూడా విషయం తెలుసు కనుక ,  వాళ్ళ ఇంటికి పోంగానే వాసాలు బయట పెడుదురు . మొదలు దిక్కు మేమూ , కొసల దిక్కు పిల్లలు,  పట్టుకొని బడికి తీసుక వచ్చినమ్. పిల్లల తలిదండ్రులు కొందరు వడ్ల పని వచ్చిన వాళ్ళు ఉండిరి . వాళ్ళ సహకారం తోటి రెండు కొట్టాలు( పెద్ద పూరిపాకలు) కట్టుడు అయింది. ఇగ పైన ఎండగొట్టకుంట , వానకు  ఉరువకుంట పైకప్పు కావాలే. ముందుగాలనే దీనికి కూడా ఉపాయం చేసుకున్నం . ఏందంటే గంగారం , దామరకుంట మధ్యన విలాసాగరం అనే ఊరు ఉంటది. విలాసాగరం చెరువు చాలా పెద్దది. తుంగ గడ్డి అని ఆ చెరువులో పుష్కలంగా ఉంటది . అది కోసుకొని వచ్చి ఎండబెట్టి పైన కప్పుతే బేఫికర్ , అనుకున్నం . కానీ చెరువుల బాగా జనిగెలు ఉంటై . అండ్లకు దిగుడు ఎట్లా అనుకుంటుండంగనే చీర్ల సూరయ్య అనే విద్యార్థి అదెంత పని సార్ , పొగాకు రసం కాల్లకు రాసుకొని దిగుతిమా అంటే అవి మన జోలికి రావు అన్నడు . శని వారం , ఆదివారం , రెండు రోజులు సార్లం ఆరుగురం, పెద్ద పిల్లలు ఒక వంద  మంది దాకా ఈలసరం చెరువులకు దిగి ఎనిమిది బండ్ల తుంగ గడ్డి కోసీనం . సర్పంచ్ బండ్లు పంపించిండు . తుంగ గడ్డి బడికి చేరింది. ఎండబెట్టినంక పిల్లలు ,  సార్లం కలిసి తుంగ ను కొట్టాల పైన పైకప్పుగా కప్పినమ్ .  పైసా ప్రభుత్వ బడ్జెట్ లేకుంట మా బడి ఆకామిడేషన్ సమస్య పిల్లలం ,మేమూ కలిసి పరిష్కరించుకున్నం .ఈ పానంతా బడి పనిదినాలు కాకుండా సెలవు రోజుల్లనే అయ్యేటట్టు చుకున్నాం  . కానీ ఇప్పుడు ఊరూరికి కావాల్సినన్ని బిల్డింగులు ఉన్నై, అవసరానికి మించి సార్లు ఉన్నరు , కానీ చదువుకొనేతందుకు  మాత్రం  విద్యార్థులు కరువైండ్రు . ఇక్కడ ఎవరి బాధ్యతను ఎవరు సక్రమంగా నిర్వహించ లేక పోయారు అంటే ,  ప్రభుత్వమే అని ఉపాధ్యాయులు , కాదు కాదు , ఉపాధ్యాయులే నని ప్రభుత్వాలు, కాదు కాదు కానే కాదు వీళ్ళిద్దరు కలిసే ప్రభుత్వ పాఠశాలలను భ్రస్టు పట్టించి సమాజం లో విలువలు దిగజారి పోవడానికి కారణమయ్యారని ప్రజలు అంటున్నారు. కనుక ఇప్పటికైనా ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు కళ్ళు తెరిచే విధంగా ప్రజల నుండే ఒత్తిడి రావాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment