Monday, February 20, 2017

ఇంటిమీదెవుసమ్ 28 .

                                     ఇంటిమీద ఎవుసమ్ 28

ఫిబ్రవారి నెల పుస్తకాలల  దినోత్సవం కూడా ఉన్నందున కావచ్చు నమస్తే తెలంగాణ ఎడిషన్ ఇంచార్జ్ చిల్ల మల్లేశం గారు తాను రాసిన మహా పథం కవితల పుస్తకం తెచ్చి ఇచ్చిండు.   అట్ట వెనుక రాసి ఉన్న కవితా చాలా ఖతర్నాక్ గా ఉన్నది. . మల్లేశం గారిది అలుగు నూరు. నేను గణితం ఉపాధ్యాయునిగా , ప్రధానోపాధ్యాయునిగా ఎడేండ్లుఅలుగునూర్ లో  పని జేసిన అనుభవం ఉంది కనుక మా మధ్యన అలుగునూరు పాఠశాల ముచ్చట్లే ప్రధానంగా సాగినై. మీరు అలుగునూర్ లో పనిజేసినప్పుడు బడి చాలా బాగా నడిచింది అని ఆయన ఆనంగానే నాలో ముడుచుకొని ఉన్న బడి పంతులు లేచి నిలబడ్డాడు . ఆయన వెంట వచ్చిన సుభాష్ అనే అతని సహచరుడు మా టీచర్ ఆకుల భూమయ్య సార్ చాలా గొప్ప ఉపాధ్యాయుడు అనే సరికి ఇక నేను ఆగ లేక మా తరం రికార్డు వేసుడు షురూ జేసిన

మేము అక్కడ పని జేసినప్పుడు పాఠశాల కేవలం చదువు వరకే పరిమితం గాకుండా సాయంత్రం ఆటలు, ప్రతి శనివారం సాయంత్రం పిల్లల ఇస్టారాజ్యం అని ఉపన్యాసాలు, పాటల పాడుకోవడం, కవితలు చెప్పుకోవడం, మానేరు పత్రిక అని ఒక గోడ పత్రిక తీసే వాళ్ళం. పిల్లలు రాసిన , లేదా సేకరించిన కథలు, జానపద గేయాలు ఒక డ్రాయింగ్ పేపర్ మీద మా మునయ్య సార్ చేవ్రాలు అద్భుతంగా ఉండేది ఆయన తోటి రాయించి నోటీస్ బొర్ద్ద్ పైన అతికిస్తే పిల్లలు ఆ రచనల కింద వాళ్ళ పేర్లు చూసుకొని మురిసి పోదురు . వచ్చే సంచికలో నా పేరు ఉండాలే , అంటే నా పేరు ఉండాలే అని పోటీలు వడి రాసుకొని వద్దురు. నేను వాటిని ఎడిట్ చేసి మునయ్య సార్ కు ఇచ్చేదీ. ఆయన అందంగా తీర్చి దిద్ది గోడ పత్రిక పధిహేను రోజులకు ఒకసారి తీసుక వచ్చేది.

మా బడి పని విధానం, మేము చేస్తున్న కృషి తెలియ జేస్తూ పిల్లలు ఆడుకోవడానికి ఆటస్తలమ్ చదునుగా లేదు కొంత గ్రావెల్ పని ఉందని దానికి మీ ఆర్థిక సహాయం కావాలని అలుగునూర్ శివార్ లో ఉన్న ఈనాడు యాజమాన్యానికి లేఖ రాసిన. ఆనాటికి పిల్లికి బిచ్చం కూడా వేయదు అని పేరున్న ఈనాడు యాజమాన్యం అలుగు నూర్ పిల్లల ఆటస్తలమ్ కోసం 25 వేల రూపాయల చందా ఇచ్చింది. ఆటల సారు ఎడవెల్లి రాజీ రెడ్డి సార్ ఆ బాధ్యత తీసుకునే పటికే ఇప్పుడు ఆ బడికి చాలినంత ఆటస్తలమ్ తయారైంది. బడి చుట్టూ ఉన్న మర్రి, రాగి, మేడి చెట్లు కూడా మేము పెట్టినవే. వాటిని చూసినప్పుడు చాలా సంతృప్తి అనిపిస్తుంది.

మేము తరుచుగా  పిల్లల ఇండ్లకు వెళ్ళేవాళ్లం . అలా  వెళ్ళడం వలన పిల్లల తలిదండ్రుల ఆర్థిక మరియు
సామాజిక స్తితి తెలిసేది. మీ అబ్బాయి , లేదా అమ్మాయి బాగా చదువుతున్నారు, వాళ్ళను ఇంకా పై చదువులు చదివించాలి అని మేము చెప్పినప్పుడు వాళ్ళ మొఖాలు వెలిగి పోయేవి. అట్లనే సార్ మీరు చెప్పుతున్నరుగదా అని వాళ్ళు అన్నప్పుడు మా మొఖాలు వెలిగేటివి.

ఒకసారి ఏడవ తరగతి చదువుతున్న వెంకటి అనే అబ్బాయి వరుసగా బడికి రావడం లేదని గమనించి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళినమ్. మేము వెళ్ళేసరికి  బురుద కాళ్ళ తోటి వెంకటి  గప్పుడే ఇంటికి వస్తున్నడు .  నన్ను చూసి భయం భయం గా గలుమల్లనే ఆగి పోయిండు . ఎదురుగా వెళ్ళి భయం లేదన్నట్టుగా భుజం మీద చెయ్యేసి ఏం సంగతి ఎందుకు బడికి వస్తలెవ్వని అనునయంగా అడిగిన. మీరు జెయ్యంగనే అన్నడు . పానం దస్సుమన్నది. అయినా వేగిర పడకుండా , అట్లనా ? నేను ఏమన్నా కోడితినా అన్న. కొట్టుడు కాదు గాని కొడుతవేమో అన్న భయం తోటే నేను వస్తలేను అన్నడు.నేను ఎందుకు కొడుత అనుకుంటున్నావ్ అంటే నాకు లెక్కలు వస్తలెవ్వు, అర్థం అయిత లెవ్వు అన్నడు.  నీకు ఏ లెక్కలు వస్తలెవ్వు  అంటే ఎవ్వీ వస్తలెవ్వు అన్నడు. సరే నీకు అన్నీ అర్థం అయ్యేటట్టు చెప్పుత , నిన్ను  కొట్ట అని హామీ ఇచ్చి బడికి తీసుకొని వచ్చిన.  తీసివేత, గునుకారం , భాగారం, అతనికి అర్థం అయ్యే దాకా చెప్పిన . బస్ ఆ ప్రోత్సాహం తోటి తర్వాత సంవస్తరం నుండి తరగతి లో అతడే మొదటి ర్యాంకర్ గా నిలిచిండు . అందుకనే నేను ఆ బడిలో ప్రతి సంవస్తరం వేయించే వీధి నాటకం లో భాగంగా ఒక సారి వేసిన వీధినాటకం " ఈత " లో వెంకటి ప్రధాన పాత్ర వేసిండు. నేను రాసిన " ఉరువిసికెల పోరు "  కథా  సంకలనం లో ఆ నాటకం ఉంది.  అని చెపుతూ ఇక్కడ ఒక ఉపాధ్యాయునిగా అలుగునూరు నాకు ఇచ్చిన గొప్ప సంతృప్తిని గురించి మీకు చెప్పాలే అన్న.

వాళ్ళకు టైమ్ అవుతుండ వచ్చు కానీ నా ఉత్సాహాన్ని చూసి నన్ను నిరుత్సాహ పరుచలేక  "చెప్పండి "  అన్నరు.

2014 ల నేను మా పిల్లలతో కొన్ని రోజులు గడుపుదామని వాళ్ళ దగ్గరికి పోయుంటి . ఒక నాడు షాపింగ్ మాల్ ల  ఒక యువకుడు  " నమస్కారం సార్ అనుకుంటా " ఎదురుగా వచ్చిండు. దేశం గాని దేశం ల నన్ను సార్ అని సంబోధించే వాళ్ళు ఎవరై ఉంటారని నేను  అట్లనే చూస్తున్న . " సార్ నేను వెంకట్ ను అలుగునూరు " అన్నడు.

' అరే నువ్వారా " అని  ఒక్కసారి ఆనందం పట్టలేక బిగ్గిత కాగలిచ్చుకున్న . సార్ ఆనాడు మీరు మా ఇంటికి వచ్చి నాకు ధైర్యం జెప్పి అట్లా లెక్కలు చెప్పే పటికే నేను ఇంజనీరు సదువు చదివి ఇక్కడికి రాగలిగిన " అన్నడు . నాకు కండ్లల్ల నీళ్ళు గిర్రున తిరిగినై .


                                     


No comments:

Post a Comment