Monday, February 27, 2017

ఇంటిమీదెవుసమ్ 30

                                                          

శారీరిక శ్రమ కొంచెం ఎక్కువ అయితున్నదో ఎందో ఈ మధ్యన రోజూ మధ్యాహ్నం  నిద్రవస్తున్నది కొంచెం .  బయట డోర్ కొట్టిన చప్పుడైతే కొంచెం ఇబ్బందిగానే వెళ్ళి డోర్ తీసిన. ఎదురుగా , నాతో గతం లో ప్రజాస్వామిక తెలంగాణ కోసం కలిసి పనిజేసిన వీరన్న అనే మిత్రుడు , ఆయన వెనుక ఒక ఆడ కూతురు. లోపాలికి ఆహ్వానించి , ఎండన పడి వచ్చిండ్రు గదా అని  చల్లటి మంచి నీళ్లు రంజన్ ల నుంచి ముంచి,  తెచ్చి ఇచ్చిన.

ఆ: చెప్పండి ఎంపని మీద వచ్చిండ్రు. ఎవరీ అమ్మాయి అని ఆమె దిక్కు చూస్తూ  అడిగిన. అమ్మాయి నిండు చూలాలు . ఈ అమ్మాయి మీకు తెలిసినాయనే,  జాగిత్యాల  యెంకటేశం( పేరు మార్చిన) కూతురు, ఆమే మీతోని మాట్లాడేది ఉందంటే తీసుకొని వచ్చిన అన్నాడు. మళ్ళీ ఆయనే అన్నడు, ఈ అమ్మాయిది లవ్ మ్యారేజి, భర్త ఇంట్ల నుండి వెళ్లగొట్టిండు, తలిదండ్రులు ఇంట్లకు రానిస్తలేరు , ఒక ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నది, బియ్యం, పప్పు లు ఫలానా ఆయన మీకు తెల్సినాయినే ఇప్పించిండు , మీరుకూడా ఏమైనా సహాయం చేస్తారేమోనని వచ్చినం అన్నడు. వాళ్ళ నాన్న ఎందుకు రానిస్త లేడు , నేను  వస్తపా ,  అడుగుదాం అన్న. ఆ అమ్మాయి నోరు విప్పింది , అంకుల్ ,ఈ అంకుల్ చెప్పినట్టు మాది ప్రేమ పెళ్లి కాదు,  నిజానికి అతన్ని నేను ప్రేమించలేదు, నా చదువు అయిపోయిన తర్వాత సింగపూర్ ఎయిర్ లైన్స్ లో నాకు ఏర్ హోస్టస్ గా జాబ్ వచ్చింది,నెలా నెలా జీతం డబ్బులు మా నాన కు ఇచ్చేదాన్ని. ఆ డబ్బుల్తో ,  మా నాన ఇల్లుకట్టుకుందాం అంటే జగిత్యాల లో ఇల్లు కట్టుకునుడు మొదలు పెట్టినమ్, మా ఇంటిముందర ఉండే వడ్లోల్ల పిల్లడు ఎప్పటికీ నన్ను చూస్తూ ఉండేది, నన్ను చూస్తున్న విషయం గమనించినా  , తెలిసీ తెలియని వయసు లో ఫాంటసీ గా అనిపించి నేను ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. ఒక రోజూ హైద్రాబాద్ లో డ్యూటీ ముగుంచుకొని ఇంటికి వస్తుంటే నన్ను కిడ్నాప్ చేసి రేప్ చేసిండు. పేపర్లో కూడా వచ్చింది. కేస్ పెట్టినం. కేసు ముగుంపు దశకు వచ్చే సమయం లో మా వకీళ్ళు ఏమి లోపాయి కారి ఒప్పందానికి వచ్చిండ్రో ఏమో కానీ అతడు నిన్ను పెళ్లి జేసుకుంటడు కేసు విత్ డ్రా జేసుకొమ్మని ఒత్తిడి చేసిండ్రు. సరే అని ఒప్పుకొని అతన్ని పెళ్లి జేసుకున్న. కులం గానోన్ని, ఏమి ఉద్యోగం సద్యోగం, సంపాదన లేనోన్ని పెండ్లి జేసుకున్నవని మా నాన నన్ను ఇంటికి రావద్దన్నడు . హైద్రాబాద్ ల నే ఇల్లు దీసుకొని అక్కన్నే ఉండుకుంట నేను డ్యూటీలు చేస్తూ ఉండేది. ఆయనకు కూడా దేశాలన్నీ తింపి చూపిన. ఏమి పనిచేయక పోయేది. నా జీతం డబ్బులు మొత్తం అతడే తీసుకుంటుండేది. ఆ  డబ్బులతోటే ఆయన ఇద్దరు చెల్లండ్ల పెళ్లిళ్లు కూడా చేసినమ్. ఇంతలా నాకు ప్రెగ్నెన్సి వచ్చింది. కనుక ఫోర్స్ బుల్ సెలవులో ఉండవలసి వచ్చింది. హైద్రాబాద్ లో ఇల్లుకిరాయి ఎందుకని జగిత్యాల వచ్చినం. ఒకరోజు రాత్రి  బాగా తాగి తనతో బాటు మరొకడిని వెంట దీసుకొని వచ్చి మా బెడ్ రూమ్ లోకి తోలిండు. ఆ వచ్చిన వాన్ని నేను తీవ్రంగా ప్రతిఘటించిన . నా భర్త లోపటికి వచ్చి ఈయన ఎవరనుకుంటున్నవ్ , ఆయన తల్సుకుంటే నీ లాంటి వాళ్ళు బోలెడు మంది ఆయన కాళ్ళ  కాడ  పడి చస్తర్, ఒప్పుకోక పోతే చంపుత అంటూ తన చేతుల ఉన్న కత్తి తోటి ముఖం పైన చేతుల పైన గాయాలు చెసిండని చెప్పింది. ( సంక్షిప్తత దృస్ట్యా, సభ్యత దృస్ట్యా కొంత ఎడిట్ చేశాను) . వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేసిందట, కానీ ఎవరూ పట్టించుకోలేదట, హాస్పిటల్ కు వెళ్ళి వైద్యం చేయించుకొని వారం రోజుల తర్వాత హైద్రాబాద్ వెళ్ళి పోలీస్ మంత్రిని కలిస్తే ఆయన అక్షింతలు వేసిన తర్వాత గాని నిందితుణ్ణి అరెస్ట్ చేసి జైల్ లో వేయలేదట. ఆ పని అంతా అయిపోయి తండ్రి ఇంటికి వెళ్తే  నీవు ఇట్లా గర్భం పెట్టుకొని నా ఇంట్లో తిరిగితే ,  నాకు పెండ్లి కావాల్సిన బిడ్డ ఉంది,   అంతగా ఐతే మరి గర్భ విచ్ఛిత్తి చేసుకొని రా అప్పుడు ఆలోచిస్తా , నిన్ను ఇట్లా ఇంట్లో పెట్టుకుంటే దానికి పెళ్లి కాదు, అన్నాడట. నన్ను కనలేదా తండ్రిగా నీకు బాధ్యత ఏమీ లేదా అంటే నువ్వు ఎక్కడనన్న  పో నాకు నీతో సంబంధం లేదు అన్నాడట. అంటూ బోరున విలపించింది. చాలా బాధ అనిపించింది. నా వంతుగా కొంత ఆర్థిక సాహాయం అందించి,  ఇట్లాంటి సందర్భాల్లో సహాయం అందించే ఒక స్వచ్ఛంద సంస్త అడ్రస్  హైయద్రాబాద్ ఇచ్చి పంపిన.

ఆ  పిల్ల అట్లా కావడానికి ఆమె తండ్రి భావించినట్టు అంతా ఆ పిల్ల తప్పేనా ? ఆమెను కిడ్నాప్ చేయడం వాని దుర్మార్గమే కావచ్చు , కానీ అక్కడ ఆ తండ్రి తన రెక్కలల్లో దాచుకోవాల్సిన తీరులో లోపమే లేకుండా ఉండే అందామా ? ఆయన ఆ లోపం చేసి ఉంటే , అందుకు ఈ  సమాజం , వ్యవస్త ,  మీడియా పాత్ర లేనే లేదా ? ఆ రేపిస్టు  అంతా నిర్భీతిగా ఒక అమ్మాయిని రేప్ జేసి , పెళ్ళాడి , తార్పుడు గాడు గా మారేటంతటి దుర్మార్గుడుగా మారడానికి ఈ ప్రభుత్వాల, చట్టాల, పాలనల, దోషం లేదని అందామా ? మొత్తంగా మనిషి ఇంత స్వార్థ పరుడు గా మారుతున్న సందర్భం లో అనేక ప్రశ్నలను మనకు మనం వేసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తున్నది. అమెరికా లోని కాన్సాస్ లో ఆడమ్స్ ఫ్యూరిస్టర్ అనే జాత్యహంకారి , శ్రీనివాస్ కూచి బొట్లను కాల్చి చంపినప్పుడు అదే జాతికి చెందిన ఇయాన్ గ్రీల్లోట్ తుపాకి తూటాలకు అడ్డు నిలిచి అలోక్ ను మృత్యుముఖం నుండి రక్షించి " నా తోటి వ్యక్తి కోసం నేను ఏమి చేయాలో అది చేశాను " అంటాడు. అలాంటి నిస్కల్మషమైన మనుషులను కులాల వారిగా మతాల వారిగా , దేశాలా వారిగా , జాతుల వారిగా విభజిస్తున్నది ఎవ్వరూ ? వారి పట్ల మనం ఎందుకు జాగ్రత్తగా ఉండలేక పోతున్నాం.? వారి మాయ మాటలకు మోస పోయి అధికార పగ్గాలు  ఎందుకు అప్పగిస్తున్నామో మనుసున్న మనుషులుగా అందరం ఆలోచించాలి. అని నేను ఇది ముగిస్తుంటుండగా నా భార్య పైన బంగ్ల మీద కోతులు ఏందో బాగా లొల్లి జేస్తున్నై ఉరుకు ఉరుకు అంటే బంగ్ల మీదికి పరిగెత్తిన,  కోతులనుండి మొక్కలను కాపాడుకునేతందుకు . కానీ అక్కడికి పోయే వారకు ఏమున్నది. ఒక చిన్న కోతి పిల్ల నేను అమర్చిన జి ఏ వైరుల చిక్కుకొని దాటరాక మొత్తుకుంటున్నది . చిన్న,  పెద్ద కోతులన్నీ ఆ చిన్న కోతికి మద్దతుగా అక్కడ చేరి ,  పెద్ద బొబ్బ వెడుతున్నై. వాటి దగ్గరకే మనం పొలేని పరిస్తితి. ఒక పెద్ద కోతి మెల్లెగా సుతారంగా ఆ పిల్ల కోతిని తీగల్ల నుంచి దాటించుకొని తీసుకొని పొంగానే కోతులన్నీ అక్కడి నుంచి కామ్ గా వెళ్ళి పోయినై. జంతువులమ్ కాదు మనుషులం అని చెప్పుకొనే మనం అందరం అట్లా స్పందించే లక్షణం మళ్ళీ ఎప్పుడు అందిపుచ్చుకుంటామో వేచి చూద్దాం !

No comments:

Post a Comment