Sunday, January 29, 2017

రాజ్యాంగ వ్యవస్తలు కూలిపోతున్నై 3


ఇవ్వాల ఆంధ్ర జ్యోతి పేపర్లో సిద్ది పేట పోలీస్ కమిష్నర్  తనను వేధిస్తున్నాడని హుస్నాబాద్ సి ఐ గారు  వాపోతు వార్తలల్ల ఎక్కిండు.  అనధికార సమాచారం మేరకు ఒక పోలీస్ స్టేషన్ కు ఎస్సై గానో సి ఐ గానో లేదా ఒక డివిజన్ కు ఏ సి పి గానో పోస్టింగ్ పొందాలంటే రాజకీయ ప్రాపకం తో బాటు గా లక్షల కొద్ది మాముల్లు సమర్పించుకుంటే దప్ప లూప్ లైన్ పోస్టింగు లే నట. ఇందులో కొన్ని స్టేషన్ లకు ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందట. ఎందుకంటే అక్కడ బాగా ఆమ్దానీ వచ్చే అవకాశం ఉంటే ఎక్కువ రేటు పలుకుతుందట. గ్రానైట్ క్వారీలు, ఇసుక క్వారీలు, రియల్ ఎస్టేట్ దందాలు , బ్రాందీ షాప్ లు, ఇట్లా బ్లాక్ దందాలు  ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ స్టేషన్ ల కు డిమాండ్ ఉంటదట .


అంటే ఏమిటి చట్ట వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలను వీళ్ళు అడ్డుకోనందుకు చట్టవ్యతిరేక వ్యతిరేక దందాదారులు చేస్తున్న వారు  వీళ్ళకు లంచాలు ఇస్తారన్న మాట . మాజీ నక్సలైట్ నయీమ్ వాళ్ళ లాంటి కథలు ఆవేగదా ? చట్ట ప్రకారం జరిగితే తద్వారా సిద్దించే ఆదాయమంతా ప్రజా ప్రభుత్వానికి చేరుతుంది . అన్నీ చట్ట ప్రకారం జరుగాలనే , ఇన్కమ్ టాక్స్ , సేల్స్ టాక్స్ , రెవెన్యూ, కమర్శియల్ టాక్స్, విజిలెన్స్, పోలీస్, ఎక్సైజ్ , ఇట్లా అనేక రకమైన వ్యవస్తలను రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు జేసుకున్నాము. వీటిని ప్రజామోద్య యోగంగా నిర్వహించడానికి చట్ట సభలు , ప్రజా ప్రతినిధులు ఉంటారు. ఇవన్నీ రాజ్యాంగం పుణ్యాన వచ్చినవే.


కానీ రాజ్యాంగాన్ని కాపాడుతామని, అమలు చేస్తామని వాగ్దానాలు చేసి వచ్చిన రాజకీయ నేతలు , ప్రభుత్వాధికారులు రాజ్యాంగ వ్యవస్తలను వాటి స్పూర్తి మేరకు వాటిని పనిజేయనీయకుండా ఆ వ్యవస్తలను నీరుగారుస్తూ వ్యక్తిగత లబ్ది పొందుతూ అశేష ప్రజానీకం ప్రయోజనాలనన్నింటిని వారికి దక్కకుండా బొక్కేస్తున్నారు .


ఛత్తీస్ గఢ్ లో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా , వనరుల ధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బేలా భాటియా ను రాష్ట్రం విడిచి వెళ్ళి పోవాలని హుకుం జారీ చేస్తున్నారు. భారత పౌరురాలుగా ఆమె కు భారత దేశం లో ఎక్కడైనా నివసించే హక్కు ఉంటది. కానీ అది ఛత్తీస్ గఢ్ లో అమలు ఉండదు.


ఆదానీలు , అంబానీలు వేల కోట్ల రూపాయల పన్నులు , బ్యాంకు అప్పులు చెల్లించడం లేదని సోసియల్ మీడియా లో రోజు వార్తలు వస్తుంటాయి. కానీ వారంతా ముఖ్య మంత్రుల , ప్రధాన మంత్రుల ల చుట్టే ఉంటారు.


ఎన్నికైన పార్ల మెంటు గాని, అసెంబ్లీ గానీ తొలి సమావేశం అయిన నాటి  నుండి అయిదేండ్ల కాలపరిమితి పనిజేయాలని రాజ్యాంగం లో ఉంటుంది. కానీ ప్రధాని మోడి అనుచర వర్గం యేమో  ఒకే దేశం ఒకే సారి ఎన్నికలు అని సభలు, సమావేశాలు పెట్టి పిలుపు ఇస్తాయి.


అమెరికా రాజ్యాంగం ప్రకారం చట్ట పరమైన పేపర్లు ఉన్న వాళ్ళు ఎవ్వరైనా  ఆ దేశం లో నివసించవచ్చు .కానీ డొనాల్డ్ ట్రంప్ యేమో ఫలానా దేశస్తులు అమెరికా లో ఉండకూడదని, రాకూడదని ఫత్వా జారీ జేస్తాడు.

ఒక రాష్ట్రం , ఒక దేశం ,ఒక  అగ్రరాజ్యం ,  ఇట్లా అన్నీ కూడా  రాజ్యాంగాలను ఉల్లంఘిస్తూ , రాజ్యాంగ వ్యవస్తలను కాల రాస్తూ వాళ్ళు మాత్రమే రాజకీయంగా , ఆర్థికంగా మరింత , మరింత బలోపేతం అవుతూ ప్రజలను మాత్రం మరింతగా మరింతగా  పరాధీనులను జేస్తూ  పోతున్నారు. కానీ ప్రజలు మాత్రం మళ్ళీ మళ్ళీ అటువంటి వారినే ఎన్నుకుంటున్నారు.

No comments:

Post a Comment