Wednesday, March 1, 2017

ఇంటిమీదెవుసమ్ 31

                                            

ఉపాధ్యాయ ఉద్యమమమ్ లో కలిసి పనిజేసిన వాళ్ళు చాలా మంది నా వలెనే ఒక్కరోక్కరుగా రిటైర్ అవుతున్నారు. ఆ క్రమం లో వడ్డేపల్లి మల్లేశం అని ఒక ఉపాధ్యాయ ఉద్యమ కార్యకర్త, కవి మిత్రుడు 28 ఫిబ్రవరి నాడు రిటైర్ అవుతున్నా రమ్మంటే హుస్నాబాద్ పోయిన. మధ్యాహ్నం భోజనం ఏర్పాటుచేశారు. తినడానికి ప్లాస్టిక్ కవర్ వేసిన పచ్చ రంగు అట్టా పేపర్లు పెట్టిండ్రు. అందులో తినగూడదు , అవి క్యాన్సర్ కారకాలు అని గట్టిగా చెప్పిన తర్వాత మాకు స్టీలు పల్లాలు పెట్టినా , అన్నీ చోట్ల ఇవే పెడుతున్నారు,  తిని బైట వేస్తే సులభంగా పని అవుతుందని అన్నారు నిర్వాహకులు. అన్నీ సులభతరం చేసుకుంటున్నాం అనుకుంటూనే అలివిగాని రోగాలు కొనితెచ్చుకుంటున్నాము అని చెపుతూనే మా భోజనం పూర్తి జేకుకొని సమావేశం లో కూర్చున్నాము. చాలా మంది పాత మిత్రులు, సహచరులు కలిశారు. ప్రధాన వక్తగా వచ్చిన ప్రొఫెసర్ కాశిం మాట్లాడుతూ భారత దేశం లోని తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రి బాయి ఫూలే ఆనాడు అంత ధైర్యంగా సనాతన వాదులను ఎదిరించి చదువుచెప్పిన ఫలితంగా ఇవ్వాళ దేశం లో మహిళలకు విద్య అందుబాటులోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అక్కడ సభాద్యక్షురాలు మహిళా కావడం మూలాన. ఆ తర్వాత అంబేడ్కర్ కు చదువుచెప్పిన ఉపాధ్యాయుని చొరవ లేకుంటే భారత రత్న, రాజ్యాంగ రచయిత, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం లో  , వారి హక్కులకోసం రాజ్యాంగం లో కొన్ని రక్షణలు కలిపించిన డా: బాబా సాహెబ్  అంబేడ్కర్ భారత దేశానికి లభించక పోయి ఉండేవాడు, కనుక ఉపాధ్యాయుని పాత్ర సామాజిక వికాసం లో గొప్ప పాత్ర పోషిస్తుందని అన్నాడు. ఉపాధ్యాయునికి ఒక మూడు లక్షణాలు తప్పకుండా ఉండాలని చెప్పాడు. గొప్ప అధ్యయన శీలి కావాలి, తాను అధ్యయనం చేసిన అద్భుతమైన విషయాలను మరింత అద్భుతమైన శైలి లో విద్యార్తులకు బోధించాలి, సమాజాన్ని చైతన్యవంతమైన సమాజంగా ముందుకు తీసుకు వెళ్లడానికి నూతన ఆవిస్కరణలను కనుగొని సామాజానికి అందివ్వాలని అన్నారు.  

ఈ క్రమం లో ఆయన భారతం లోని సభా పర్వం నుండి ఒక ఉదాహరణ చెప్పారు. రాయబారిగా వచ్చిన కృష్ణుడు , భీష్మ ,  ధ్రోన, కృపాచార్యుల్లాంటి సభలోని పెద్దలను ఉద్దేశించి ," పాండవులు బతుకడానికి కేవలం అయిదూల్లు ఇమ్మంటున్నారు గదా అవికూడా ఇవ్వనని దుర్యోధనుడు అంటున్నాడు, అప్పుడు మరి యుధ్ధం అనివార్యం అవుతుంది, మీరు ఎవరిపక్షం నిలబడి యుధ్ధం చేస్తారని "  అడుగుతాడటా . అప్పుడు మేము ఇంతవరదాకా కౌరవుల ఉప్పు తింటున్నాము కనుక కౌరవుల పక్షం నిలబడి యుధ్ధం చేస్తాం . "కానీ ధర్మం పాండవుల వైపు ఉంది కనుక పాండవులు గెలువాలని కోరుకుంటున్నాం"  అని అంటారట. ఉద్యోగులుగా, ఉపాధ్యాయులు గా మనం ప్రజల ఉప్పుదిని బ్రతుకుతున్నాం. కనుక మనం ప్రజల పట్ల విశ్వాసం గా మెలుగాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పాడు. చాలా మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు , ఎవరైనా ఒక సామాన్యుడు ఈ పని ఎందుకు చేయవు? ఆఫీసుకు ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని ప్రశ్నిస్తే " నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి " అని ఎదురు తిరుగుతారు . కానీ వాళ్ళు తినేది ఆ ప్రజల ఉప్పే అన్న జ్ఞానం కలుగుజేసిన కాశీం కు అందరూ చప్పట్లు కొట్టారు.

No comments:

Post a Comment