Sunday, March 5, 2017

ఇంటిమీదెవుసమ్ 32

                                                 

ప్రతి దినం ఉదయం ఆరుగంటలకే మా ఇంటి సమీపం లో ఉన్న హెలిప్యాడ్ గ్రౌండ్ కు వాకింగ్ కు వెళ్ళడం అలవాటైంది. కరీంనగర్ జిల్లాకు ఎప్పుడో కొండా రెడ్డి అనే ఒక ఆర్ డి వో ఉన్నప్పుడు ఆ గ్రౌండ్ లో వేప చెట్లు నాటించిండు . పొద్దున పొద్దున గ్రౌండుకు పోతే  ఇప్పుడైతే కమ్మటి వేప పూత వాసన వస్తది . అక్కడి చల్లటి గాలి ఒక్కసారి అలువాటైతే ఇక పొద్దున పోకుంటే ఏదో కోల్పోయినట్టు ఉంటది. అక్కడ ఆరోగ్యం కోసం రకరకాల మనుషులు వస్తుంటరు. సామాన్యంగా నా మానాన నేను కాసేపు నడిచినంక కొన్ని ఆసనాలు వేసుకొని మొక్కలకు నీళ్ళు చళ్లడానికి ఇంటికి వస్తుంట . అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు ఎందుకోగాని పక్కోళ్లను మెసిలియ్యకుంటే వాళ్ళకు మనుసుల వట్టది గావచ్చు , ఒకతను , పరిచయస్తుడే లెండి, నా పక్కకు వచ్చి " ఇగో గా సుల్తానా బాద్ రవీందర్ రెడ్డి , నేను , చదువుకొంగ ఒక్క రూమ్ లనే ఉండి చదువుకున్నం . ఆయిన ఇప్పుడు హైద్రాబాద్ ల ఐదువందల కోట్లకు ఉన్నడు . మనము ఉన్నం ఏం లాభం, ఏ ఉద్యోగం జేసినోడు అంత సంపాయిస్తడు చెప్పు " అన్నడు .  "ఒక మనిషి సంపాదనే అతడు గొప్పోడు అని చెప్పడానికి గీటు రాయి కాదు గదా " అన్నాను.  " అరె అట్లంటవెంది భై   . ఆయిన చాలా మంచోడు లైన్స్ క్లబ్ మెంబరు గూడా , పేదోళ్ళకు మస్తు సహాయం జేస్తడు " .. అంటూ సంభాషణ కొనసాగిస్తున్నడు .అతని తో వాదన వెట్టుకుంటే నా టైమ్ అంతా వెస్ట్ అయితది . మొక్కలకు నీళ్ళు వెట్టెవరకు ఎండ అయితది అని విచారం జేస్తున్న. ఇంతల ఆపద్బాంధవుని తీరుగా ఇంకో వాకింగ్ దొస్తు వచ్చిండు. మా మధ్యన జరుగుతున్న ముచ్చటంత ఆయన వింటూనే ఉన్నడు కనుక"  ఐతే సంపాయించినోడే మొనగాడంటరా సారూ " అన్నడు. అంతే గదా అన్నడు. ఐతే గాంధీ మహాత్ముడు ఏమన్నాడో విను , " నీ దగ్గర నీ కనీసావసరాలకంటే ఒక్క రూపాయి ఎక్కువున్నా అది నీవు నీ పక్కొని జేబుల నుంచి దొంగిలించి నట్టే అన్నడు " అన్నాడు . " గాంధీల కాలం గాదండి ఇదీ, పెట్టుబడి లేంది అభివృధ్ధి ఎట్లా జరుగుతది . చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు అయ్యన్నీ " అన్నడు దురుసుగా  . ఈయనకు  జర కాలి నట్టైంది .  "సారూ మీరు చరిత్ర చదువుకున్నారా"  అని అడిగిండు. " ఓ మస్తుగా చదువుకున్నం "అన్నడు. " మీరు ఏమి చదువుకున్నారో గాని నేను చెప్పుతా విను" ,  అన్నడు.

మానవ పరిణామ శాస్త్రం లో మనలను అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మన  మనుషులను నియాన్డార్తాళ్ మానవులు అంటారు. వీళ్ళు భూమి పైన 40 వేల ఏండ్ల కిందటి నుండి మాత్రమే ఉన్నారు. అంతకు ముందు హెమోసేపియన్స్ , వారికంటే ముందు ఎరక్టస్, వాళ్ళ కంటే ముందు ఆస్ట్రోలోపితికన్స్ 4 మిలియన్స్ ఏండ్ల కిందనుండి ఉండేవారు. చరిత్రలో హరప్పా మహంజొదారో నాగరికత గురించి విన్నారు కదా ? అది క్రీ; పూ; 3300 నుండి క్రీ; పూ; 1300 ఏండ్ల కిందటిది .  మీ లాంటి గొప్పవాళ్లు చెప్పే వేద కాలం , క్రీ; పూ; 1500 నుండి 1100 వరకు. మీరు చెప్తున్న పారిశ్రామిక విప్లవం క్రీ; శ ; 1760 నుండి క్రీ;శ' 1820,1840 వరకు. అంటే 200 ఏండ్ల కిందటి వరకు నీ పెట్టుబడి అనే భావనే లేదు. క్రీ;శ ; 1914 -1918 వరకు మొదటి ప్రపంచ యుధ్ధం, 1939 -1945 రెండవ ప్రపంచ యుధ్ధం తర్వాత గదా మీరిప్పుడు గొప్పగా చెబుతున్న  అమెరికా ,పెత్తనం, 1990 ల తర్వాత గదా గ్లోబలైజేషన్ ,పేరుతోటి  పెట్టుబడులు అభివృధ్ధులు, అభివృధ్ధి పేరుతోటి అలివిగాని వనరుల విధ్వంసం జరుగుతున్నది. మంచి చెడు, విచక్షణ వదిలేసి , ఎవ్వడు ఎట్లా జచ్చినా నాకేంది అనే బాపతు లక్షలు కూడబెడితే, జర మానవత్వం ఉన్నోళ్ళు మనుషుల తీరుగా మిగిలి పోతున్నరు . 40 వేల ఏండ్ల నుండి ఈ భూమి మీద మానవులు జీవిస్తున్నప్పటికి ఈ ఇరవై ఏండ్లల్ల జరిగినంత విధ్వంసం అంతకు ముందు ఎన్నడూ జరుగలేదు. అడువులు , గుట్టలు, నదులు, ఆఖరుకు భూమిని సైతం లేకుండా నాశనం జేస్తూ అడ్డగోలుగా సంపాదిస్తూ అదే  అభివృధ్ధి అంటూ , మీరు చెప్పే మాటలు బుధ్ధిన్నోడు ఎవ్వడన్న నమ్ముతడా ? ఇది ఇట్లనే కొనసాగితే మానవ మనుగడే ప్రశ్నార్థకం అయ్యే పరిస్తితి." అంటూ దిమ్మ దిరిగి పోయే జవాబు చెప్పేసరికి, మీరంతా ఆంగ్లీయులు చెప్పిన చరిత్ర మాటలు నమ్ముతూ. , హిందూ దేశం విశ్వాసాలను, సాంప్రదాయాలను ,  భారతీయతనూ అవమాన పరుస్తున్నారని కోపం జేస్తూ విస విస లేసి వెళ్లిపోయిండు .

No comments:

Post a Comment