Saturday, January 7, 2017

రాజ్యాంగ వ్యవస్తలు .............. 1

రాజ్యాంగ వ్యవస్తలు చెడిపోవడానికి రాజకీయ వ్యవస్త లే కారణం. 1


అప్పుడు నేను పెద్దపెళ్ళిలో మండల విద్యాధికారిగా పనిజేస్తున్నాను. నేను ఒక పాఠశాలకు పర్యవేక్షణకు వెళ్ళినప్పుడు ఒక ఉపాధ్యాయుడు సెలవు పత్రం గానీ అనుమతి గాని లేకుండా  రెండు రోజుల నుండి బడికి రావడం లేనట్టు గమనించాను.

ఆయన పాఠశాలకు ఆబ్సెంట్ అయినట్లు రిమార్క్ రాసి రెండు రోజుల వేతనం ఎందుకు కట్ చేయగూడదూ  అంటూ మేమో ఇచ్చాను.

వెంటనే ఒక రాజకీయ నేత నుండి ఫోన్ , " నేను ఫలానా మాట్లాడుతున్నాను , మా బంధువు ఫలానా వ్యక్తి కి వేతనం కట్ చేస్తానని మేమో ఇచ్చావట అది వాపస్ తీసుకో "  అని.

ఒక ఉపాధ్యాయుడు బాధ్యత లేకుండా బడికి రాకుంటే వ్యవస్తకు ఎట్లా నస్టమో  వివరించాను. గవ్వన్ని మాకు చెప్పద్దు. మాకు తెలువదా ? నేను చెప్తున్నాను , నువ్ మా వోని వేతనం ఇచ్చేయ్ అంటూ ఆర్డర్.

అట్లా ఇస్తే నా అడ్మినిస్ట్రేషన్ చెడిపోతుంది, మండలం లో విద్యా వ్యవస్త క్రమశిక్షణ తప్పి  విద్యార్థుల చదువులకు నస్టమ్ జరుగుతుంది ,  కనుక నేను మీరు చెప్పినట్టు చేయలేను " అన్నాను.

అంత నీతి మంతునివా ?  నువ్వేం తప్పులు చేస్తలెవ్వా ? అంటూ ఓ  రాయి విసిరి చూశారు.

మీ బంధువైన ఆ ఉపాధ్యాయున్నే అడుగండి అన్నది నా జవాబు. సరే నీ సంగతి ఎక్కడ చూడన్నో అక్కడ చూస్తానని బెదిరింపు. నేను ఫోన్ కట్ చేశాను. తర్వాత నా ఆచరణ గురించి తెలుసుకొని మళ్ళీ ఇక అడుగలేదనుకోండి.

కానీ ఇప్పుడు వారే పాలక పార్టీ ఎమ్మెల్యే ! వారి పరిపాలన ఎట్లా ఉంటుందో మనం ఊహించడమేమీ కస్టమైన విషయం కాదుకదా ?  

No comments:

Post a Comment