Saturday, January 28, 2017

యాది ..మనాది 2

                                                  యాది --- మనాది  2

యాది మనాది 2 ఇంత వెంటనే రాస్తా అని అనుకోలేదు.ఈ రోజు  పొద్దున లేవంగానే మా అల్లుడు బుర్ర తిరుపతి నుండి  మెస్సెజ్ వచ్చింది. రామోజు సత్యనారాయణ శర్మ గుండె పోటు తో రాత్రి చనిపోయిండని . గుండె కలుక్కుమన్నది .  నేను మరొక ఆప్త మిత్రున్ని కోల్పోయిన.

ఎప్పటి యాది ?

అది 1979 సెప్టెంబర్ 30 . మా నాయిన వీరగొని నర్సయ్య నన్ను ఒంటరి వాన్ని చేసి వెళ్ళిపోయిన రోజు. అక్టోబర్ లో దసరా పండుగ వచ్చింది. అప్పుడు నా భార్య లక్ష్మి మేన మామ ఎగోలపు రాజయ్య మమ్ములను ధన్నవాడ నుండి మంగ పేట కు దసరా పండుగకు పిలుచుకొని పోయిండు . . మంగ పేటను నేను ఎప్పుడు యాది జేసుకున్నా ఆ రోజుల్లో ఎప్పుడూ పారే హుస్సేన్ మియా వాగు, ఆ వాగు నీళ్ళతో ఆ ఒడ్డు ,  ఈ ఒడ్డు  , న ఉన్న పొలాలన్నీ సస్యశ్యామలమై ఉండడం , ఊరు చుట్టూ పెద్ద పెద్ద తాటి చెట్లు, సారవంతమైన మట్టి , నీళ్ళు, పంటలు పండించే తందుకు శ్రమ పడే యువ శక్తి పుష్కలంగా ఉన్న గ్రామం యాదికి వస్తది .

మా తమ్ముడు ఏగోలపు రాజేందర్ ,  బావమర్ది  బుర్ర రాయమల్లు , మామ వరుస అయ్యే బుర్ర చిన్నన్న వీళ్ళంతా చుట్టాలు కావడం మూలంగా వాళ్ళకు గురువు లాంటి సత్యనారాయణ శర్మ ఇంటికి నన్ను తీసుక పోయి నన్ను ఆయనకు పరిచయం చేసిండ్రు. అట్లా సత్యనారాయణ శర్మ నాకు 38 ఏండ్ల కింద పరిచయం అయిండంటే ఇగో ఈ రోజు మా సోపతి విడిపోయింది. సత్యనారాయణ శర్మ ఊరు యువకులనందరిని కూర్చొబెట్టుకొని తనకు తెలిసిన విషయాలన్నీ వారికి బోధించే వాడు. అట్లా సత్యనారాయణ శర్మ కాస్త సత్తెయ్య పంతులు అయిండు . ఆనాటికి ఆయన ఇంకా ప్రభుత్వ టీచర్ కాలేదు. కానీ పౌరోహిత్యం కూడా చేస్తున్నందున అందరూ సత్తెయ్య పంతులు అనే పిలిచేవాళ్లు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన తర్వాత ఆయన పేరు రిజిస్టర్ లో సత్యనారాయణ శర్మ అయింది. కానీ ఆబాల గోపాలానికి మాత్రం ఆయన సత్యనారాయణ పంతులు లేదా సత్తెయ్య పంతులే.

నా ఆహ్వానం మేరకు 1980 జనవరి ల ఆయన మిత్రుడు టి. తేజన మూర్తిని తీసుకొని ఒక సైకిల్ మోటార్ పైన మా ఊరు ధన్నవాడకు వచ్చిండ్రు. మా ఊరికి చేరుకునే వరకు వాల్లు తెచ్చిన ఆ పాత మోటార్ బైక్ మొరాయించి స్టార్ట్ కాకుండా ఉండిపోయింది. మెకానిక్ లు ఎవ్వరూ ఉండని  ఊరు మాది. బండిని విడిచి పెట్టి పోలేని పరిస్తితి వారిది. ఆ బండి పుణ్యాన మూడు రోజుల పాటు మేము ముగ్గురం చాలా విషయాలు చర్చించుకునే అవకాశం దొరికింది .వాళ్ళు ఇద్దరు పక్కా సాంప్రదాయ వాదులు. నేను వాటికి విరుద్ద భావజాలం కలిగిన వాన్ని.  అయినా కూడా ఎక్కడ కూడా ఆ మూడు రోజుల మా అభిప్రాయాల కలబోతలో ఎవరిని ఎవరం హర్ట్ చేసుకోలేదు.,  పైపెచ్చు మా స్నేహం గట్టిపడ్డది కూడా అప్పుడే .

ఎస్. రామ చెంద్రమ్ అని కరీంనగర్ కార్ఖానా గడ్డకు చెందిన ఒక ఉపాధ్యాయుడు మా " సి వో యు " ఆధీనం లో ఉన్న గుమ్మళ్ళ పెళ్ళిలో హెడ్ మాస్టర్ గా పనిజేస్తుండే వాడు . నాతో ఏదో పనిబడి ఆయన మా ఇంటికి వస్తే సైకిల్ మోటార్ విషయం చెప్పిన. కిందా మీదా పడి బండిని స్టార్ట్ చేసిండు. నా ఆతిథ్యానికి ధన్యవాదాలు చెప్పి తిరుగు ప్రయాణమైనారు .

ఆ తర్వాత ఆయన స్వంత తమ్ముడు రామోజుల శంకర్ అలియాస్ చెంద్రన్న  ఈ సమాజాన్ని దురస్తు జేసె పనిలో సాయుధుడై వెళ్లిపోయిండు. ఒకే తలిదండ్రుల పెంపకం లోపుట్టి పెరిగిన అన్నదమ్ములు  ఇద్దరు భిన్న దృవాలను ఎంచు కున్నారు.

మంగ పేట గ్రామం చాలా చైతన్యవంతమైన గ్రామం. బుర్ర చిన్నన్న అలియాస్ మాధవ్, బురా రాయమల్లు, ఏగోలపు రాజేందర్ ప్రత్యామ్నాయ రాజకీయ పోరాటం లో అసువులు బాసినారు. ఈ సమాజానికి మంగపేట మట్టి ,   హుసేన్ మియా వాగు తన పురిటి బిడ్డలను బహుమతి గా ఇచ్చింది.



ప్రత్యామ్నాయ రాజకీయాలకై పోరు బాట ఎంచుకున్న వాళ్ళు, జయరాజన్న పాట బాడి నట్టు   "  పేరు కోసం అందామా అయ్య అవ్వబెట్టిన పేర్లు ఉండై, డబ్బు సంపాయించడం కోసం అందామా సంక సద్దిగూడా ఉండది. " అట్లా కేవలం ప్రజల సామాజిక హక్కుల కోసం పోరాటం జెసి అమరులైతే వాళ్ళ చుట్టాలు పక్కాలు వారికి వారసత్వ హక్కుగా ఉండే భూమిని కాజేసి అమరుల భార్యా బిడ్డలను ఆగం జేసె ప్రయత్నం జరుగుతున్నది . ఆ క్రమం లో బుర్ర చిన్నన్న అమరుడైతే ఆయన పాలు భూమిని ఆమ్ముకొనే ప్రయత్నం జరిగింది. ఆ సందర్భం లో సత్యనారాయణ శర్మ ఆ గ్రామం " ఆలివర్ గోల్డ్ స్మిత్ విలేజ్ స్కూల్ మాస్టర్ "  వలె బుర్ర చిన్నన్న భార్యా బిడ్డల పక్షాన నిలిచి వారి హక్కులను కాపాడే కృషి చేసిండు.

అలాంటి వ్యక్తికి శ్రధ్ద్ధాంజలి ఘటించి హుసేన్ మియా వాగులోంచి నడిచి వస్తుంటే సత్యనారాయణ శర్మ మనుమడు ఎవరితోనో చెప్పుతున్నడు " మా తాతయ్య కాలి పోతున్నడు చూస్తున్న , ఆగు " . అని . ఆ పసి హృదయం ఎంత మదన పడుతున్నదో కదా అని గుండె బరువెక్కిన హృదయాన్ని  చిక్కబట్టుకొని ఇల్లు జేరిన .

No comments:

Post a Comment