Friday, January 27, 2017

ఇంటిమీదెవుసమ్ 21

                                                              ఇంటిమీదెవుసమ్ 21

గత 8 సంవస్తరాల నుండి నేను  పుట్టి పెరుగిగి, ఆడి పాడి, బతుకు పాఠాలు నేర్చుకున్న  ఊరిలో, నేనూ , నా పిల్లలు కూడా చదువుకున్న, మా ఊరి బడికి వెళ్ళి అక్కడ చదువుకుంటున్న పిల్లలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఒక పని గా పెట్టుకున్నాను.  ప్రతి 15 వ  ఆగస్ట్ కు వెళ్ళేవాన్ని. ఈ సారి ఆ సమయం లో నేను ఇక్కడ లేకపోవడం చేత 26 జనవరినాడు , నిన్న  వెళ్ళినాను. ఐతే నేను వెళ్ళి ఆ విద్యార్థులను ప్రోత్సహించడం మాత్రమే గాకుండా నా పూర్వ విద్యార్థులు అదే పాఠశాలలో చదువుకున్న వారిని సైతం మోటివేట్ జేసి వారోతో కూడా పాఠశాల అవసరాలకు ఆర్థికంగా సహాయం చేయిస్తున్నాను. ఆ క్రమం లో ఇన్సూరెన్సే కంపనీలో ఉన్నతోద్యోగం చేస్తున్న నా పూర్వ  విద్యార్థి గాడపర్తి వెంకటేశ్వర్లు తన సతీ సమేతంగా పాఠశాలకు వచ్చి పిల్లలకు ప్రోత్సాహకాలు అందించాడు.

ఆ సందర్భంగా మా నాయిన జ్ఞాపకార్థం మిగిలి ఉన్న మడ్ల చేనుకు పోయిన . మా ఇండ్లకు దగ్గర్లోనే ఉంటది. అక్కడనే నేను జొన్న చేనుకు పిట్టే కావాలి కాసింది.   20 వ పోస్ట్ లో నేను రాసిన విషయాల కొనసాగింపు కు అక్కడ మరింత  సమాచారం దొరికింది.

20 వ పోస్ట్ లో మనిషి తన పంట కాపాడు కోవడానికి పురుగుమందు కలిపిన బియ్యం చల్లి పశు పక్షాదుల మరణానికి కారణమైన విషయం అందులో రాసినాను. ఐతే ఇక్కడ ఇదే చేనులో నేను పిట్ట కావాలి కాసిన రోజుల్లో మా ఊరి చుట్టూ అతి దగ్గరలో చిట్టడివి ఉండేది. కొంచెం దూరం పోతిమా అంటే పెద్ద అడివే  ఉండేది. రాత్రంతా ఆ అడివిలో తల దాచుకొనే పక్షులు తెల్ల వారకుంటానే జొన్న చేన్ల మీదికి ఆహారం కోసం వచ్చేవి. మేము అప్పటి ,  ఆ , అడివంచునున్న గ్రామాలల్లో ఉండే ఆ చలిలో గజ గజ వణుకుతూ తల చుట్టూ వరికట్లమ్ కట్టుకొని ఈ పిట్టలను చేన్ల పైన వాలకుంటా ఒడిశెండ్ల తోటి కొట్టుకుంటా మంచెమీద కావాలి ఉందుము. ఒక్కొక్క సారి రామ చిలుకలు గుంపులకొద్ది వచ్చేటియి . మంచే మీది నుంచి ఒడిశెల తోటి విసిరే ఒడిశెల గుండ్ల చప్పుడుకు లేవకుంట అట్లనే జొన్న కంకులు తినుకుంట కర్రలమీదనే ఉండేటియి . అప్పుడు మంచే దిగి చిలుకలు వాలిన పుట్టుగుంపుల దిక్కు ఏయ్ ! లే లే అని మొత్తుకుంట ఉరుకుదుము . ఆకలి మీద ఉండునో ఏమో కొన్ని చిలుకలు అస్సలు లేవకుంట అట్లనే ఉండేటియి. అప్పుడు మా జొన్నలు దొంగతనంగా తింటున్నారా అని కోపం తో ఉన్న నేను మెల్లగా ఒక రామ చిలుక తోకను యెనుకనుంచి దొరుక వుచ్చుకున్న. కేర్ కేర్ మని ఒక్కటే లొల్లి జేసుకుంటా దొరికిన కాడనల్లా కొరకవట్టింది .  దొరికినవ్ బిడ్డా నీ సంగతి ఇట్లగాదని రెక్కలు మెలివెట్టి మంచెకాడికి తీసుకవోయిన . భయం తోటి ఉన్నదాయే తప్పిచ్చుక పోదామని రెండు మూడు ప్రయత్నాలు చేసింది కానీ నేను సాగనీయ్యలేదు.

ఇంటికి వొయ్యే టప్పుడు మెల్లెగా దాని నున్నటి రెక్కలు, మెడ దువ్వుకుంట దాని అందమైన , ఎర్రటి ముక్కును సరిదిద్దుకుంటా ఆనందం తోటి దాన్ని ఇంటికి తీసుకొని పోయిన. గలుమల్లనే నన్నుజూసిన నాయిన " ఏందిరా ! రామ చిలకను దొరుకవట్టినవా? ఇడిచి పెట్టు ఇడిచి పెట్టు పాపం దలుగుతదిరా ? " అన్నడు .

" ఏ ! నేనెక్కడ ఇడిసి పెడుత . చేనంత తిన్నది. ఇంకో సారి సేను మొఖాన రాకుంట జేసి గాని దీన్ని ఇడిసి పెట్ట అన్న "

" అరే ! అద్దు కొడుకా , అవ్వెట్ల బతుకాలే రా ! పండిచ్చిన పంటంత మనమే తింటమార ? అచ్చెగాడు , బిచ్చెగాడు , పసులు, పచ్చులు అందరు తింటరు ,  అన్నీ బతుకాలే . ఇడిసి పెట్టు ఇడిసి పెట్టు " అని నేను ఆ రామ చిలుకను విడిచి పెట్టేదాకా ఊకుండలేదు .

No comments:

Post a Comment