Wednesday, January 25, 2017

ఇంటిమీదెవుసమ్ 20

                                                                  ఇంటిమీదెవుసమ్ 20


పురుగుమందులు చల్లడం వలన మేలుజేసే క్రిమికీటకాలు కూడా నశించి పోతున్నాయని రాసిన రాతలు చదివిన తర్వాత నా అనుభవం లోని విషయాలు కూడా మీతో పంచుకోవాలని రాస్తున్నాను.


రెండు సంవస్తారాల క్రితం అక్టోబర్ మాసం లో మా ఊరికి పోవాల్సి వచ్చింది. మా అన్న కొడుకు ఈత చెట్టు పైనుండి పడి చనిపోయిండు .  ఆ సందర్భం లో మూడవ రోజు , ఐదవ రోజు శవాన్ని దహనం చేసిన చోట వంట జేసి పక్షులకు పెట్టడం సాంప్రదాయం. పక్షులు వచ్చి తినిపోయేదాకా బంధుమిత్రులు అక్కడే ఉంటారు. చాలా సేపు వేచి చూసినమ్ ఒక్క పక్షి కూడా రాలేదు. ఈ విషయం ఎన్నో సార్లు ఎందరో కథలు కథలుగా రాశారు కూడా. సరే ఏ పక్షి రాకపోయినా మనషులు ఆగిపోరు కదా?


ఆ రెండుమూడు రోజులు అక్కడే ఉండవలసి వచ్చింది. మా వాడకు పడమర వైపు కాపొల్ల వాడ ఉంటది. నాతో చదువుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ నేను చదువు చెప్పిన విద్యార్థులు చాలా మంది ఆ వాడలో ఉంటారు. వాళ్ళతో కాసేపు కాల క్షేపం చేద్దామని అక్కడికి వెళ్ళిన. నేను వెళ్ళిన తర్వాత నా విద్యార్థులు ఓ పది పదిహేను మంది జమైనారు. వాళ్ళంతా వ్యవసాయం చేస్తున్న వాళ్ళే. అందరూ వరి , పత్తి   ప్రధానంగా పండిస్తున్నవారే.


ఎవరెవరు ఎన్నెన్ని ఏకరాల్లో పత్తి , వరివేసింది ఆరా తీస్తున్నాను. వాళ్ళు చెపుతున్నారు. ఏ పంట సులభం అంటే వరి సులభం పత్తి కి ఎక్కువ పని పెట్టుబడి అన్నారు. మా చిన్నప్పుడు మన ఊరు చుట్టూ ఉన్నా చేన్లల్ల అయితే తెల్ల జొన్న, లేదా నువ్వులు, కందులు, గోధుమలు వేద్దురు కదా ఇప్పుడు ఎందుకు వేస్తా లేరు? అంతకస్టమైనా ఆ పత్తినే ఎందుకు పండిస్తున్నారని అడిగిన. కస్టపడ్డా లాభం వస్తున్నదని అన్నారు. జొన్నలు, కందులు పండుత లెవ్వు , పండినా ధర ఉంటలేదు. పెట్టుబడి వెల్లడమే కస్టమైతాంది అన్నరు .


కానీ పత్తికి ఇత్తునమ్ బెట్టిన కాన్నుంచి మందులే అన్నరు. ఎప్పుడెప్పుడు ఏమేమి మందులు కొడుతరు అని అడిగిన.
విత్తనాలు వచ్చుడే మందు కలిపి వస్తున్నై కనుక మునుపటి తీరుగా పెంక పురుగు ఏమీ ముడుతలేదు . కానీ పక్షులే తవ్వుకొని బుక్కుతున్నై . అందుకని  పక్షులు తినకుంట ఏంజేస్తున్నారంటే , ఇయ్యాల రేపు అగ్గువకు దొరికే కిలో రూపాయి బియ్యం ఓ బస్తా,  అరబస్తా కొని ఆ బియ్యం ల  ఎండ్రీన్ కలిపి చేనంత చల్లుతరు . ఇగ ఆ బియ్యం తిన్న కాకులు , గోర్రెంకలు, ఉరవిస్కెలు, రామ చిలుకలు , దుబ్బెర పిట్టలు , అక్కడనే చేనులనే చచ్చిపోతై. రెండుమూడు రోజులు చేనంత గబ్బు వాసనే. ఆ చచ్చిన పిట్టల తిన్న గద్దలు, పిల్లులు, కుక్కలు కూడా చచ్చి పోతున్నయని వాళ్ళు చెప్పంగానే నేను నోరెల్లవెట్టిన .

No comments:

Post a Comment