Sunday, January 29, 2017

ఇంటిమీదేవుసమ్ 22

                                              ఇంటిమీదెవుసమ్ 22

ఇయ్యాల నా ఇంటిమీద కోతులు కిస్కింధ కాండే జేసినయ్. బాగా నారాజ్ అయిన. పదేండ్ల సుంది కరీంనగర్ చుట్టుపక్క గుట్టలను గ్రానైట్ క్వారీలకు గంపగుత్తాగా దోచిపెడుతున్నది సర్కారు. పాత సర్కారంటే పరాయోంది తెలంగాణ సర్కారు అట్లా చేయదని కొందరు ఆశ పడ్డరు . వట్టిపోయిన తెలంగాణ కాదు వనరులున్న తెలంగాణ అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రాయే . కానీ సర్కారంటేనే వనరులు దోసుకునుడనే నిర్వచనానికి వచ్చేటట్టు చేస్తున్నై సర్కారులన్నీ.

1969 ల తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తున్నందున ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం లో విద్యా సంస్తలన్నింటిని సర్కారు మూసివేసింది. అప్పుడు నేను పి  యు సి ( ప్రీ యూనివర్సిటీ కోర్స్ ) చదువుతున్న.కాలేజీ బందై  ఇంటికి పోయినంక ఆ ఏడాది కాలం ఫుల్ టైమ్ ఎవుసమ్ చేసిన. అప్పుడు మా ఊరికి ఉత్తరం వైపు ఉన్న జంగల్ ను హైద్రాబాద్ నుండి ఎవరో సేటు కాంట్రాక్ట్ తీసుకొని మొత్తం నరికించిండు . ఎడ్డ్ల బండ్ల తోటి ఒక్క దగ్గరికి చేరవేసే తందుకు నేను బండి గట్టుకొని కిరాయికి పోయిన. పెద్ద పెద్ద మాకులు ముక్కలు ముక్కలు నరికిండ్రు. ఇద్దరిద్దరం పట్టి బండి నింపుకొని సడుగు పక్కన ఒక్కదగ్గర కుప్ప వేస్తే అట్లా అడివంత లారీల కు లారీల కొద్ది పట్టణాలకు చేరింది. మిగిలిపోయిన అడివి రష్యా, చైనా, ఇంగ్లాండ్ దొరలకు  దొర పొగాకు అంటే వర్జీనియా పొగాకు క్యూరింగ్ కోసం ఇక్కడి ఇనుప ఫర్నేసులల్లా కాలి బూడిద అయింది.

అట్లా అడువులను తమ దేహం మీద మొలిపించుకొని లక్షల సంవస్తరాల నుండి మానవ మనుగడ కోసం రక్షణ కవచం లా నిలిచిన గుట్టలు , తమ పైన ఉన్న అడువులు అంతరించిన తరువాత దోపిడి దార్లకు గుట్టలంటే నోట్ల కట్టలే అయినై. గుట్టలను ధ్వంసం చేయడం అభివృధ్ధి ఆట. ఆ పని జేస్తున్నందుకు వాళ్ళకు ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 300 కోట్లు రాయితీ ఇచ్చిండ్రు. వాళ్ళు పెడుతున్న గ్రానైట్ కోత మిషన్లకు బ్యాంకులు తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తున్నాయి. గ్రానైట్ ను పరిశ్రమ గా భావించి ఆ లోన్ల మీద సబ్సిడీ ఇస్తున్నది . అంతేగాదు కరెంటు గూడా వాళ్ళకు సర్కారు సబ్సిడీ పైన సప్లై చేస్తున్నది. సబ్బండ జనాలకు అక్కెరకు ఆదుకునే గుట్టలను ఏ ఒక్కనికో కట్టబెట్టి వాణి లాభాలకు కారణమైతరు  అందుకు ఎవరి ప్రతిఫలం వాళ్ళు పొందుతరు.

మొత్తం గుట్టలన్నీ ధ్వంసం అయిన తర్వాత గుట్టల్ల ఉన్న కోతులు, గుడ్డేలుగులు , కొండచిలువలు, నెమలి పిట్టలు, తేనె టీగలు , గుడ్ల గూబలు ,ఆ గుట్టలల్ల నివాసం ఉన్న  ఆరోక్క జీవ రాశి తమ నివాసాలు కోల్పోయి పునరావాసం కోసం ఊర్ల దారి వట్టినై. పంట పొలాలు, వంటగదులను కోతులకు  నివాసాలు గా చేసింది సర్కారే !

మా చిన్నప్పుడు ఎవ్వరి పశువులన్న పచ్చని పంట పొలం గాని, ఆఖరుకు  దడి దునికి గడ్డి మేసినా గాని బంజెరుదొడ్డి ల కట్టేద్దురు . పశువుల యజమాని తప్పుకు దండుగ కట్టి విడిపించుక పొయ్యేది. మనిశైనా , జంతువైనా ట్రెస్ పాస్ జేస్తే నేరం. జీవ వైవిద్యాన్ని కాపాడ వలసింది సర్కారు. కనుక కోతుల యజమాని సర్కారు అవుతుంది. జంతువు తప్పుజేస్తే జంతువు యజమాని తప్పుదారి అవుతాడు. కనుక కోతులు చేస్తున్న నస్టానికి తప్పుదారు ఎవ్వరైతరో ఎవ్వర్ని బంజేరు దొడ్లే వెయ్యాన్నో  మీరే చెప్పాలే !

No comments:

Post a Comment