Friday, January 27, 2017

యాది .. . మనాది !

                                                    యాది --- మనాది   1

అదే రెటైర్ అయిన కొత్త లో ఒక రోజు ఆకుల భూమయ్య సార్ కాల్ చేసిండు. ఆ రోజు నేను మా ఊరు ధన్నవాడ లో ఉన్నాను. అదే విషయం చెప్పిన. ఏం పని మీద వెళ్ళినావని అడిగితే , మనకు చదువనేర్పిన  , నడత నేర్పిన బడికి మన రుణం దీర్చుకొనే పనిమీద వెళ్ళిన అని చెప్పిన. ఎలా చేస్తున్నావాపని అని అడిగితే , ఇవ్వాళ సర్కారు బడికి వస్తున్న పిల్లలు అందరూ దాదాపుగా పేదవాళ్లే కనుక మనకు చేతనైన ఆర్థిక సహాయం చేస్తున్నాను. అదీ  మా నాయిన వీరగొని నర్సయ్య జ్ఞాపకార్థం ఇస్తున్నట్టు చెప్పిన. మంచి పని చేస్తున్నవ్ . ఇక నుండి నేను కూడా మా ఊరు జులపెళ్ళి మండలం కాచాపూర్ బడికి ఏదో ఒకటి చేస్తానని చెప్పిండు.

అన్న మాట ప్రకారం 2009 జనవరి నుండి ఆయన కూడా పదివేల రూపాయల చొప్పున 15 ఆగస్టు, 26 జనవరికి కాచాపూర్ విద్యార్థులకు  ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చాడు. అయితే ప్రతిసారి రేపు ప్రోగ్రామ్ ఆనంగా ఒక రోజు ముందుగా కరీంనగర్ లో మా ఇంటికి వచ్చేవాడు, ఒక్కొక్క సారి అరునక్క కూడా ఆయన వెంట వచ్చేది. ప్రోగ్రామ్ రోజున తెల్లవారు జామున్నే లేచి ప్రయాణమై నలుగురమ్ కలిసి పెద్దపల్లి వరకు వెళ్ళి వారిని పెద్దపల్లి జండా చౌరస్త్తా వద్ద వదిలి మేము ధన్నవాడకు వెళ్ళే వాళ్ళం. సాయంత్రానికి కరీంనగర్ చేరుకొనే వాళ్ళం. వీలైతే హైద్రాబాద్ వెళ్ళే వాడు వీలు కాకుంటే మా ఇంట్లోనే ఉండే వాడు. అప్పుడప్పుడు మా మనుమరాలు శ్రీజని తో ఆయన ఎక్కువ సమయం గడిపే వాడు. ఆమె కాస్త అల్లరి పిల్ల . అల్లరి పిల్లలను ఎలా మేనేజ్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. వాళ్ళిద్దరు మంచి దోస్తులు  .అయ్యిండ్రు .

విగత జీవుడైన భూమయ్య సార్  కరీంనగర్ తెలంగాణ చౌక్ లో రాత్రి పది గంటలకు వస్తే శ్రీజని పట్టుబట్టి భూమయ్య సార్ ముఖం చూసి శ్రద్దంజలి చెప్పి తన దుఖం పంచుకున్నది. నాకు భూమయ్య తాతను చూడబుద్ది అవుతుందని ఎన్నో సార్లు మారాం చేసింది కూడా. ఎలా తెచ్చి చూపగలం, ఏమని సముదాయించగలం ?

2013 డిసెంబర్ 24 నాడు ప్రొఫెసర్  కాశిం గారు  రాసిన తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరించి ,  ప్రసంగించిన సందర్భం లో  తెలంగాణ ప్రజా ఉద్యమాల్లో అమరులైన వారీనందరిని పేరుపేరుణా యాది జేసి ఇంటికి చేరకముందే రోడ్డు ప్రమాదం పేరు తో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు భూమయ్య సార్ ను కబళించింది . జీవించినంత కాలం శాస్రీయ విద్యా విధానం కోసం, ప్రజల జీవించే హక్కుల కోసం , ప్రజాస్వామిక తెలంగాణ కోసం , అనుక్షణం విరామం లేకుండా ఉద్యమాలు నిర్మించిన ప్రజా ఉపాధ్యాయుడు ఆకస్మికంగా హఠాత్తుగా అదృశ్యం చేయబడ్డాడు. ఒక వేల ఆ ఒక్క రోజు భూమయ్య సార్ జాగ్రత్తగా ఉండి ఉంటే నిన్న మాతో బాటుగా పెద్దపల్లి వరకు వచ్చి కాచాపూర్ బడి పిల్లల కు సంతోషాలు పంచేవాడు కదా అనేది ఇవ్వాల్టీ నా మనాది.

No comments:

Post a Comment