Thursday, December 22, 2016

ఇంటిమీదెవుసమ్ 10

                                                                  ఇంటిమీదెవుసమ్ 10 .

ఇయ్యాల మొక్కలకు నీళ్ళు జల్లంగ కొతిమీర మొక్కళ్ళ తెల్ల జొన్న కర్ర ఆగవడ్డది . దాన్ని జూడంగానే అబ్బ ఏం జెప్పలే తియ్యటి , తియ్యటి ముచ్చట్లు మతికి రావట్టినయి . మీతోటి పంచుకోవాన్నని మనుసు ఒక్కతీరుగ తండ్లాడుతాంది.

అయితే నాకున్నయన్ని పాత పాత ముచ్చట్లే . మీకు నచ్చినా నచ్చక పోయినా నేను సెప్పెటియైతే గవ్వే మరి. మా సిన్నతనం ల మా దండి సలి వెట్టేది సలికాలం ల. ఈ సలి కాలం అచ్చిందంటే మా ఊళ్ళల్లా అందరి ఇండ్ల ముందట నెగడి ఉండుడే . నెగడి అంటే పెద్ద పెద్ద మొద్దులు అంటే బాగా దొడ్డు ఉన్న దుంగలు , పొద్దుగూకిందంటేనే ఆ మొద్దులను ఒక్క దగ్గెరికి జరిపి నిప్పేద్దురు. జల్డిన అంటుకునే తందుకు సన్నపు శెక్క పేళ్లు పక్కల పొంటి పేరుద్దురు . మాపటీలి మా బువ్వలు దినుడు నెగటి కాడనే అయ్యేది. నిదురవొయ్యేదాక అక్కన్నే. అయితే ఈ నెగల్లు ఎడ్లు ఎవుసమ్ ఉన్నోల్ల ఇండ్లల్లనే ఉండేటియి . అడివిల నుంచి కట్టెలు తెచ్చేతందుకు ఎడ్ల బండ్లు కావలెనాయే. అయితే ఎద్లేవుసమ్ లేనోళ్లందరు ఈ నెగటి కాడికే వద్దురు. ఇగ అక్కడ నిద్రలు వొయ్యేదాకా సాత్రాలు ( కథలు ) జెప్పుడు ఉండేది. -ఒక్కొక్క సాత్రమ్ రోజుల తరబడి సాగేది. సాత్రాలు వినేతందుకు మేం పోరగాండ్లమంత పొద్దుగుకేతాళ్ళకే నెగడి కాడికి చేరే టోల్లమ్ .

తెల్లారే టప్పుడు ఓ దిక్కు బగ్గ సలివెడుతుంటే ఇంకో దిక్కు కోడి పుంజులు అవుతలి వాడలకు వినబోయే టట్టు కుక్కురూ కూ అంటే కుక్కురూ కూ అని ఇరామ్ లేకుంట కూసెటియి . ఈటితోటి ఇగ వశపడదని మళ్ళా నెగడి కాడికి చేరుదుమ్ . అప్పటికే లేసి బర్రెల పాలువిండి న మా  నాయిన పిట్టే కావలి పొమ్మని పోరువెడుతుండే. పిట్టే కావల్లప్పుడు ఎవుసదారుల కుటుంబాల ఇంటిల్లి పాది ఏదో ఒక సేను కావలికి పోకదప్పక పోయేది. కర కర పొద్దువొడిసే వారకు సేనులకు చేరకుంటే ఆ పూటకు రామ శిలుకలకు తిన్నన్ని జొన్న కంకులు . అందుకని ఆ సలికి గజ గజ వణుక్కుంట మెడకు అరి కట్లమ్ ( మెడ చుట్టూ , చేతుల చుట్టూ, పెయ్యన్త కప్పుతూ తల పై నుండి ఒక బట్ట కట్టుదురు ) కట్టుకోని సేనుకు చేరుదుము . ఒహోయ్ ! ఓడా ఓడా అనుకుంటా , రామ చిలుకలను, గొర్రే గొర్రె అనుకుంట గోర్రెంకలను జొన్న కర్రల మీద వాలకుంట ఒడిశెల తోటి కొడుదుము . పొద్దువొడిసిన కాన్నుంచి అంబటెల్ల దాకా పిట్టెలను ఆర్చి కొడుదుము. మబ్బు వడితే పగటెల్ల దాకా ఈ లొల్లి ఉండేది. పిట్టెలు అచ్చుడు మగ్గిన తర్వాత ఇంటికి వోదుము . అయితే బడికి పోబుద్ది కాన్నాడు పిట్టెలు బాగా వచ్చినయని సాకులు జెప్పి బడి ఎగ్గొట్టి జొన్న చేంలనే   ఉండి జొన్న కంకులతోటి అటుకులు కాపుకొని బుక్కుదుము కమ్మగ . ( అటుకుల ముచ్చట ఇంకా ఉన్నది రేపు చెప్పుకుందాం )

No comments:

Post a Comment