Tuesday, December 27, 2016

ఇంటిమీదెవుసమ్ 15

                                                    ఇంటిమీదెవుసమ్ 15

ఈ సలి పాడుగాను పొద్దుగాల లేద్దామంటే ఓ దిక్కు  యేళ్ళు కొంకర్లు వోతున్నయ్ మల్లోదిక్కు మొక్కలు వంకర్లు వోతున్నయ్ . తోట కూర సరే, కోతిమీర గూడా సరే. కానీ పాల కూరనైతే పచ్చి సొప్ప తీరుగ మేస్తున్నయ్ పురుగులు. యే గా పురుగువట్టిన ఆకు కూరెట్ల వండుతరు , పురుగు పురుగు రాదా కూరంత అని ఇంట్లకే రానిస్తలేరు . ఇగ మిరుప శెట్లైతే పురాగా అన్నాలమే , ముడుసుక పోయిన ముక్కు మొఖాలతోటి వాటిని సూడనే బుద్దైతలేదు . ఒక్క టమాటా శెట్లు మాత్రం మొఖంగడుక్కోని పొడరేసుకున్నట్టున్నయ్ . సరే  , మెడకేసుకున్న పాము కరువక దప్పుతదా ? ఫలితం ఎదచ్చినా రైతుకు ఎవుసమ్ జేసుడు దప్పనట్టే మనసోంటోల్లమ్  ,మొదలు వెట్టుకున్న మొక్కల సాగైతే విడిచి పెట్టం గదా?

మా పక్కోళ్ళకు చెప్పున్టి, మనం కూరగాయలు కొనే అవసరం ఉండది, మనకే మస్తు కాస్తయి అని. నా తిప్పల జూసి వాళ్లెమి అడుగుత లేరు గని , కూరగాయలు కొనవోతే సిల్లర లేక జనం పాట్లు జూస్తుంటే , నాకే మా సిన్నప్పటి ముచ్చట యాదికి వచ్చింది. ఈ సలి కాలం ల మా ఊర్ల పొంటి పరికి పండ్లు  ,బొట్టుగ్గడ్డలు (మీద నల్లటి తోలు, లోపట పసుపు పచ్చటి మెత్తటి గడ్డ) ,  పల్లి కాయలు అమ్మచ్చేటియి . ఈ కాలం లనే ఇంటి నిండా అప్పుడే పండిన వడ్లు గూడా ఉండేటియి . మా అవ్వ ను గీమాలుదుము (బతిమాలుడు) . గొట్టే గుల్ల  (వెదురు బద్దల్తో చేసిన చిన్న బుట్ట) నిండా వడ్లు వెడితే , సరికి సరి అంటే ఎన్ని వడ్లు వెడితే అన్ని పరికి పండ్లు, అన్ని పల్లి కాయలన్న మాట. ఆ బుట్ట మూతి వెడల్పు ఉండేది. పైన శిఖరం ల వడ్లు ఎక్కువగా నిలువై కానీ పరికి పండ్లు మెత్తగ ఉండి చాలా ఎత్తు శిఖరం నిలిచేది. మేము పోటీలు వడి అగో ఆనికి ఎత్తు శిఖరం కోలిసినవ్ నాకు తక్కువ కోలిసినవ్ అని తకురార్ (తగవు ) వెట్టుకోని ఎక్కువ పండ్లు తీసుకుంటుంటిమి . వరి గోసినంక మెద ఏద్దురు . మెద ఎండినంక మోపులు గట్టి కల్లం లకు తెచ్చేటోల్లు. మాపటి బడి విడిచి పెట్టినంక మెద ఎత్తిన పొలం లకు పొయ్యి పోరాగాండ్లు అందరం పరిగే ఏరుకుందుమ్. ఆ పరిగే కంకులను నలిసి వడ్లు తయారు జేసుకొని కోమటి సత్తెయ్య దుకాణం లకు వొయ్యి వడ్లు ఇస్తే ఆయిన మాకు పిప్పరమెంట్లు, బోలు పేలాల ముద్దలు ఇచ్చేది .

పొద్దంత పని జేసినోళ్లకు కూడా ధాన్యమే కూలి గా ఇద్దురు . జొన్నలైతే విసురుకోని గడుక వోసుకుందురు , వడ్లైతే దంచుకోని దబ్బడ ,  లేకుంటే నూకల బువ్వ అండుకుందురు . అందుకనే కైకిలి , వడ్ల కంటే జొన్నలనే కొలువు మందురు . ఆ కైకిలి ధాన్యం ల నుండే ఉప్పు మిరుప కాయల కోసం కొన్ని సావుకారికి కొలిస్తే ఆయిన అడిగిన సామాను ఇచ్చేది. ఏగాని కొత్త లేక పోయినా రైతు కూలీలకు ఏడు గడిచేది. నగదు రహితం మనకు నాడే ఎరుక. కానీ మన బతుకులు మనల బతుకనియ్యకుంట మన బతుకులు బతుకులే గావనీ , మోటు గాళ్ళు మీరని మొమాటం బెట్టి  తిండ్ల దగ్గెర నుంచి బండ్ల దగ్గెరిదాకా మనది గాని బతుకులను అలువాటు జేసి మార్కెట్ మట్టుకు (గుంజ, ఇంగ్లీష్ ల పోల్ ) మమ్ముల గట్టేసి , మమ్ముల రానియ్య కుంట పోనియ్య కుంట రాజిర్కం జేస్తున్నరు . అరె ఆ రాజీర్కాల కాలం ల అయినా మేము తయారు జేసుకున్నది మేము తింటుంటిమి . మేం ఏం దినాలెనో ఎంత దినాలెనో ,  నువ్వే నిర్ణయం జేస్తవ్  , మేము ఏమి తాగన్నో నువ్వే జెప్పుతవ్ . మాకు ఎంత కూలో నీదే నిర్ణయం. అండ్ల మళ్ళా రోజు కు ఎంత ఖర్చు జేయన్నో గూడా నిర్ణయం నీదే . ఇగ ఈ దేశం ల మేమేందో మాకైతే ఏమీ సముఝైత లేదు.

No comments:

Post a Comment