Saturday, December 31, 2016

ఇంటిమీదెవుసమ్ 17

                                                                ఇంటిమీదెవుసమ్ 17

రఘోత్తమ్ రెడ్డి సార్ మిద్దె తోట చూసినప్పుడు, దాంట్లే ఒక్క సారికే అయిపోయే ఆకు కూరలున్నయ్ , ఎక్కువ రోజులు కాసే బెండ, బీర , సొర, కాకర, చెమ్మ, అలసంద, రకాలు ఉన్నయ్ , అట్లనే బొప్పాయి, జామ లాంటి పండ్ల చెట్లు ఉన్నయ్ వీటన్నింటితో బాటు రకరకాల పూల చెట్లు గూడా ఉన్నయ్. ఆకు కూరలు, కూరగాయలు, ఫల పుష్పాదులన్నింటి సమాహారమే మిద్దె తోట అయ్యింది.

అట్లనే ఒక మనిషి ఈ సమాజం లో ఉన్నడంటే అతడు  లేదా ఆమె ఎందరెందరితోనో కలిసి జీవన యానాం చేయవల్సి ఉంటుంది. వారి ప్రతి అడుగులో ఒక కొత్తదనం , ఆ కొత్తదనం లో ఎందరెందరిదో తోడ్పాటు ఉంటుంది . ఆ మనిషి అక్కడ దాకా చేరుకోవడానికి తన ప్రయోజకత్వమే అనుకోవడం అహంకారమే అవుతుంది. తోటివారు చేసిన తోడ్పాటును మరిచి పోతే మనిషి సమాజం లో ఇమడ లేక ఇబ్బందులు పడుతాడు.

ఇదే విషయాన్ని నిన్న పదవీ విరమణ పొందిన మా సోదరి రోజా చాలా సింపుల్ గా తన వీడుకోలు సందేశం లో చెప్పిన విషయాలు మీతో పంచుకోవాలని చెపుతున్నాను. తన ఉనికి కారణమైన తలిదండ్రులను స్మరిస్తూనే తన తోడబుట్టిన అక్క అన్నలు, చెల్లెల్లు,కట్టుకున్న భర్త, అతని కుటుంబ సభ్యులు, కన్నకొడుకులు, వారి భార్యలు, వారి పిల్లలు, తన వ్యక్తిగత కుటుంబ జీవనం సుసంపన్నం చేయడానికి ఎవరెవరు  ఎట్లా తోడ్పడింది, తన ఆటల్లో పాటల్లో చదువులో, సత్ప్రవర్తనలో ఒక్కరోక్కరు ఎప్పటి కప్పుడు తన ఎదుగుదలకు, తనను ఆనందంగా ఉంచడానికి ఎలా తోడ్పడింది మామూలు మాటల్లో చెప్పింది. అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఆత్మీయ మిత్రులు, ఉద్యోగ సహచరులు తన ప్రతి ముందడుగుకు ముండ్లు లేకుండా ఏరి న విషయాన్ని ఎంతో వినమ్రత తో చెప్పింది.

అయితే నిజంగానే ఇవన్నీ ఆమె చెప్పినంత సుహృద్భావ వాతావరణం లో సులభంగా ఆడుకున్నంత అలవోకగా జరిగి ఉంటాయా ఎవరికైనా ? అస్సలు జరుగదు. ఏ  మనిషికైనా  ఉండే సహజమైన అభిజాత్యం, ఇగో లు అడ్డు వస్తూనే ఉంటాయి. మనసులో, మనసుతో ,మనషులతో అనేకమైన సంఘర్షణలు జరుగుతుంటాయి.  మనిషి ఇంగితం, సహచరుల తోడ్పాటు ఆ సమస్యలనన్నింటిని అధిగమించ డానికి తోడ్పడతాయి.

మన మిద్దె తోటలో ఆకు కూరలకు , కూరగాయలకు , పండ్లకు రకరకాల చీడ పీడలు సోకుతున్నాయి. ఐనా వాటిని తొలగించుకొని అమృత తుల్యమైన ఆహారాన్ని మనం భుజీస్తున్నాము. ఆలాగీ మన సహచరులు మనతో మసలుతున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా చేసి నప్పుడు, అక్కరకు రాని పండు ముక్కను కోసివేసి తినదగింది తిన్నట్లు గానే మనకు బాధ కలిగించిన సందర్భాలను మరిచిపోయి వారి వలన మనం పొందిన ఆనందాలను యాది జేసుకుంటే జీవితం ఆనందమయం . అలా గాకుండా వారి వలన కలిగిన బాధలను  అదే పనిగా గుర్తు జేసుకొని గొడవలు పడితే అదే దుఖమయం. ఆమె అంత అలవోకగా చెప్పిన మాటల్లో ఇంత అంతరార్థం ఉన్నట్లు నాకు అర్థమైంది.

No comments:

Post a Comment