Friday, December 16, 2016

ఇంటిమీదెవుసమ్

                                                          ఇంటిమీదేవుసం 8 &9


ఈ రోజు వెల్డింగ్ జేసిన నిలువు పందిరి పోల్స్ ఇంటికి తీసుక వచ్చిన. మొత్తం 6 పోల్స్. ఒక్కొక్కటి 9 ఫీట్ల ఎత్తు . పైన బొమ్మ లాంటిది ఏదైనా పెట్టేతందుకు అడ్డంగా ఒక ఫీట్ ముక్కను వెల్డింగ్ చేయించిన. దీనికి గాను, ఇనుము ఖరీదు, 1800/ రూ : వెల్డింగ్ కు 700 కలిసి 2500 రూ: అయినయి. పోల్స్ పైకి తీసుక వెళ్ళిన తర్వాత పేయింట్   వేసి గాని గోడకు బిగించడం కుదురదు అని ఆలోచించుకుంటూ గతం లో ఎట్లా ఉండే ఇప్పుడు ఎలాంటి పరిస్తితి వచ్చిందీ అని ఒక్క సారి యాబై ఏండ్ల కిందటి  గత అనుభవం లోకి వెళ్ళిన.


మా ఊరు పాత కరీంనగర్ జిల్లా మహాదే పూర్ తాలాకా ధన్నవాడ. మా బంధువులు మహాముత్తారం లో కూడా ఉండేటోల్లు . అప్పుడప్పుడు బంధువుల ఇండ్లళ్ళకు ఎడ్ల బండి మీద పోతుంటిమి. అట్లా మహాముత్తారం  పోయేటప్పుడు మా ఊరు దాటంగానే చిన్న చిట్టడివి వచ్చేది. కారెంగా పోరుకలు, కోడిశే పోరుక అక్కడక్కడ తునికి చెట్లు పాల చెట్లు కనిపించేటియి . ఆ తర్వాత కొత్తపల్లి, మొలుగుపల్లి దాటిన తర్వాత అడివి వచ్చేది. ఆ అడివిల నుంచి పోతుంటే నడీ అడివిల ఎక్కడనైతే చెట్లు ఉండక పొయ్యేదో అక్కడ ఒక చిన్న ఊరు ఉండేది. అంటే అప్పుడు ఒక ఊరు కోసం అడివిని నరికి ఊరు పొందిచ్చుకుందురు . ఇండ్లంటే పెద్ద దూలాలు మొగురాలు ఉండేటియి  కాదు. పెండెలు అనే వాళ్ళు. పెండెలు అంటే మనిషి దండ దొడ్డు ఉండే చెట్ల కొమ్మలు. వాటితోటే ఇల్లు కట్టుకోని చుట్టూ పంజర పోరుక తోటి దడి పెట్టుకొని ఆ దడి కి చుట్టూ ఎర్ర మట్టి మెత్తి మీది నుంచి పూత పూద్దురు . ఎండాకాలం వేడి , దగడు గాలిరాకుంట సలి కాలం అయితే సలి వెట్టకుంట . పై కప్పు ఏమో మోతుకాకు, లేకుంటే తేకుటాకు పూసుకు ఆకుల  తోటి కప్పుదురు . కొంచెం ఉండగలిగినోళ్లయితే కోపిరి గడ్డి కప్పుదురు. ఆ ఇండ్లు సలి కాలం ల వెచ్చగ , ఎండా కాలం ల సల్లగా ఉండేటివి .అంత కంటే ఎక్కువ అడివిని వాళ్ళు నరుకక పొయ్యేటోల్లు . అడివిని కాపాడేది నిజంగా  ఆ ఊరు వాళ్ళే అయి ఉండేది.కానీ అడివి నరుకుతున్నారని వాళ్ళ మీద కేసులు అయ్యేటివి.  ఆడివికి కాపల ఉండే జంగలాత్ అధికారులే అడివిని పెద్ద పెద్దోళ్ళకు అమ్ముకుందురు.


అట్లా చుట్టూ అడివి నడుమ ఉర్లు ఉండే పరిస్తితి నుండి నాగరికత మనుషులకు అసలు అడువన్నదే లేకుండా  కనపడకుండా జేసె గదా అని ఆలోచిస్తుండగానే ,  అడివంటే అన్నం అని యాదికి వచ్చింది. అప్పుడు ఆడివికి పోతే తునికి పండ్లు, పాల పండ్లు, పరికి పండ్లు, బలుసు పండ్లు,మొర్రి పండ్లు, మస్తుగా దొరికేటియి . మొర్రి పండ్లను తిన్నంక ఎండబెట్టి పలుగ కొడితే సారె  పప్పు వచ్చేది. సణ్ణే గడ్డలు, బొట్టుకు గడ్డలు, దామెర గడ్డలు , పసుపు గడ్డలు, బెల్లం గడ్డలు, ఇట్లా అనేక రకమైన గడ్డలు దొరికేటియి. వాటిల కొన్నింటిని ఉడుక వెట్టుకొని తింటే మరికొన్నింటిని మంటల వేసి కాల్చుకొని తిందుము . మందు మాకు లేని సచ్చమైన తిండ్లు అప్పటియి. ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు వచ్చేవారకు పెట్టుబడి వచ్చింది.  దాంతో బాటే లాభం కోసం రకరకాల మోసాలు, వేషాలు వచ్చి చేరినయి .

నాడు ఇసొంటి బీర శెట్లు , పోట్ల, దోస, దొండ , కాయల కోసం భూమి మీదనే , అడివి నుండి పందిరి గుంజలు కొట్టుకోని వచ్చి పందిర్లు వేసుకునే టోల్లమ్ . అటువంటిది ఇప్పుడు ఇండ్ల పైకప్పుల మీద ఇనుప పైపుల తోటి నిలువు పందిర్లు వేసుకుంటున్నం. మనుషుల అత్యాశ, ప్రకృతికి శాపం అవుతున్నది.

No comments:

Post a Comment