Thursday, December 15, 2016

ఇంటిమీదేవుసమ్ 7

                                                                ఇంటిమీద ఎవుసమ్. 7

ఇయ్యాల పొద్దుగాల సూదమ్ రమేశ్ గారికి పోన్ జేసినప్పుడు , సార్ ! మీరు రాస్తున్న కాలం పేరు మిద్దె మీద ఎవుసమ్ అని పెడితే బాగుంటది అని సూచన జేసిండు. నాకు గూడా అవును గదా? ఎవుసమ్ అంటే నేల  మీద నిలబడి భూమిని దున్ని చేసేది  సేద్యమైతది గదా ? రమేశ్ చక్కని సూచన చేసిండు అనుకున్న, ఆయన తోటి గూడా అన్న మంచి సూచన అని , కానీ తీరా రాద్దామని మొదలువెట్టే వారకు మిద్దె ఎందుకనో గాని నాకు పరాయిది అనిపించింది . ఇంటి మీద, లేకుంటే ఇల్లు మీద ఎవుసమ్ అని పెడితే బాగుంట దేమో అనిపించి ఇట్ల మొదలు వెడుతున్న. సరే ఇది చదివిన తర్వాత ఎవరైనా సూచన చేస్తే అప్పుడు ఏమన్నా చేర్పులు మార్పులు చేద్దాం అని ఇగో ఇట్లా " ఇంటి మీద ఎవుసమ్ " అని రాస్తున్న. మిద్దెల ఉండు కుంట మిద్దె పరాయిది ఎట్లయింది అని మీరు ప్రశ్నించ వచ్చు . దీనికి జవాబు మల్లోసారి రాస్త గాని యింత కంటే ముఖ్యమైన సంగతి ఓటి మాట్లాడు కునేది ఉన్నది, జర ఆ చర్చను వాయిదా వేద్దామ్ >

రఘోత్తమ్ రెడ్డి సార్ పంపిన " ఇంటి పంట " పుస్తకం కరీంనగర్ లో ఉన్న రత్న ప్రభ గారికి ఇచ్చే తందుకు పోయిన. ఇంట్లోకి వెళ్ళేటప్పుడే చూసిన లాన్ లో  తీర్చి దిద్దినట్టు  అందం గున్న సక్కదనాల పూల శెట్లు . అవి దాటుకుంట లోపటికి పోయిన . రత్న ప్రభ గారి సాదర ఆదరణ. అప్పుడే ఇంటి తోటలనుంచి తెంపుక వచ్చిన జామ పండ్లు పెట్టింది తినడానికి, అమ్మతనం గదా ఆదరణ అట్లనే ఉంటది మరి.  పరిచయాలు , యోగ సమాచారాలు అయిన తర్వాత మిద్దె మీదికి పోయి ఆమె పెంచు తున్న తోటను చూసిన. వాటి ఫోటోలు కూడా కొన్ని పెడుతున్న చూడండి. కానీ ఆ మొక్కల గురించి ఆమె తీసుకుంటున్న జాగ్రత్తలు, శ్రద్ద విన్న తర్వాత ఈ కాలం లోని కొందరు తలిదండ్రులు వాళ్ళ  పిల్లల పైన తీసుకుంటున శ్రద్ద కంటే గూడా మిక్కిలిగా ప్రభావతి గారు తోట పైన తీసుకుంటున్నట్లు అనిపించింది నాకు. వారు ఎప్పుడన్నా పని పైన
ఊరేలితే ఇక్కడ ఉన్న వాళ్ళు వాటి ఫోటోలు తీసి  పంపితే చూసి గాని సంతృప్తి చెందే వారు కాదట .. అంతటి అవినాభావ సంబంధం ఆమెకు మొక్కల తో . ఒక నిమ్మ మొక్క ఉంది దానికి ఆకుల కంటే గూడా పూత,  పిందే ఎక్కువగా ఉంది. కింద గూడ ఇంకా చాలానే ఉన్నాయి మొక్కలు. ఆమె అంత శ్రద్ద తీసుకుంటున్నది కనుకనే ఆ మొక్కలు అంత ఫలవంతంగా ఉన్నాయి అనిపించింది. మిద్దె తోట ను పెంచే మనం ఎవ్వరమైనా గూడా అట్లా శ్రద్ద తీసుకో గలిగినప్పుడే అంత చక్కని ఫలితాన్ని ఎక్స్ ఫెక్ట్ చేయగలం అనిపించింది . కరీంనగర్ కలక్టరేట్ లాంటి ఒక కాంక్రీట్ జంగల్ మధ్యన సహజ సిద్దమైన ప్రకృతిని తలిపించే పరిసరాలను వారు క్రియేట్ చేయడానికి ఎంతో నిబద్దత ఉంటే కానీ సాధ్యం కాదు. తన ఆరోగ్యం ఆనంద రహస్యాలు మిద్దె తోట పెంపకమే అన్నారు ఆ మానువాడ ఆడ బిడ్డ. వచ్చే టప్పుడు చక్కని సువాసనలు కలిగిన కొతిమీర , తాజా చుక్క కూర , చెట్టుమీదనుండి అప్పుడే కోసిన నిమ్మ, దానిమ్మ, జామ కాయల తో బాటు గా ఒక మునగ చెట్టు, కొన్ని కురాగాయాల విత్తనాలు ఇచ్చింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అది వారి ఆఫీస్ కం రెసిడెన్సీ, ఇంకో రెండు మూడు నెలల్లో అక్కడి నుండి వారు బదిలీ అయి వెళ్ళి పోయే అవకాశం ఉందట. చూడండి అంత అనిశ్చిత పరిస్తితి లో కూడా , కుదురు గా ఉండి గూడా ఏమీ చేయిలేని వారికంటే ఎంతో గొప్పగా తన తోటను తీర్చి దిద్దినారు .

ఇంకొక్క ముచ్చట జెప్పి ముగిస్త గని జర బోర్ ఫీల్ గాకుండ్రి . ఒక మిత్రుడు బంగుల పైకప్పు మిద్దె తోట  బరువు మోస్తదా అని అడిగితే రఘోత్తమ్ రెడ్డి సార్ జవాబు రాసిండు. ఇక్కడ నేను నా అనుభవం రాస్తే కొత్తవాళ్ళకు ఏమైనా ఉపయోగ పడుతుందో ఏమో అన్న తపన తోటి  చెప్తున్న.
\
చిన్నప్పటి నుండి ఎవుసమ్ జేసిన అనుభవం నాది . కానీ అది మా నాయిన సంపాయించిన  40 ఎకురాల ఎవుసం అనుభవమైతే ,  ఇది 4 ఫీట్ల తోటి పది  మడుల ఎవుసమ్. రిటైర్ అయిన తర్వాత ఎక్కడన్న కొంత భూమి తీసుకొని ఎవుసమ్ జేస్తే ఎట్లుంటదని అనుకుంట మిత్రుడు ఆకుల భూమయ్య తోటి ఆలోచన జేసిన. ఇన్ని రోజుల నుంచి ఎందరికో మాటలు జెప్పి అప్పుడే చెప్పిన మాటలు, చేసిన పనులు మరిచి పోయి నీ సంతోషం కోసం స్వార్త పూరితంగా ఆలోచిస్తే ఎట్లా అన్నడు . గతించిన మా సేవా కాలం లో మేము సమాజం నుండి మనం చాలా పొందినామన్న సంగతి ఒక్కటోక్కటిగా గుర్తు జేసెటోల్లమ్ . మనం పొందిన విద్య, ఉద్యోగం,తినే తిండి, కట్టే బట్ట,  ఉద్యోగం ద్వారా సంక్రమించిన సామాజిక హోదా, ఆ ఉద్యోగం వలన పొందిన వేతనం, ఆ వేతనం వలన పిల్లలను ఉన్నతంగా చదువించుకోవడం ,చాలా చాలా మంది కంటే మెరుగైన జీవనం గడుపడం ,  ఇవన్నీ సమాజం నుండి పొంది సామాజానికి మనం ఏమిస్తున్నామో ఎవరికి వారుగా మనల్ని మనం ప్రశ్నించు కోవాలని అనేక సందర్భాల్లో చెప్పిన వాళ్ళం గదా మనం. ఇప్పుడు ఇంకా కుటుంబ బాధ్యతలు గూడ   పెద్దగా లేవు కనుక నీకు నచ్చిన రంగం లో సామాజిక బాధ్యత నిర్వహిస్తే బాగుంటదని అన్నడు. నా బాధ్యతను మల్లోసారి గుర్తు చేసిండు. పర్యావరణ రక్షణ  పైన కొంత కాలం పనిజేసిన , ఆయన అమరుడు అయిన తర్వాత చాలా రోజుల దాకా కాలం నిరాసక్తి గా గడిచిపోయింది .ఎప్పుడో నేను రాసిన కతలను పుస్తకంగా అచ్చు వేయించిన అదీ మా పెద్దల్లుడు బుర్ర తిరుపతి ప్రేరణతో . అయితే  ఒక రెన్నెల్ల క్రితం మా పిల్లల దగ్గరకి పోయినప్పుడు మళ్ళీ ఎవుసమ్ మీదికి మనుసు మళ్ళింది. అది కూడా ఇగో ఇసొంటి ఇంటిమీదేవుసమే. అగో అప్పుడు రఘోత్తమ్ రెడ్డి సార్ ను ఫేస్ బుక్ ల చూసిన. మా సోపతి గూడా పాత కతల సోపతే . కనుక ఇండియా కు రాంగానే  సార్ ఇంటికి వెళ్ళి మిద్దె తోట చూసి వచ్చిన . ఆయన సూచన మేరకు సూదమ్ రమేశ్ గారి సిమెంట్ మడులను చూసిన .


కరీంనగర్ లో చౌకగా దొరికే షాబాద్ బండలు, తేలిక పాటి సిమెంట్ ఇటుకలు పెట్టి 4x4 ఫీట్ల తోటి 11 సిమెంట్ తొట్లు  కట్టించిన . 1 : 1 నిష్పత్తిలో మట్టి , మాగిన పెండ కలిపి తొట్ల ను నింపి , కొన్నింటిలో విత్తనాలు కొన్నింటిలో మొక్కలు నాటిన . మంచి వ్యాపకం . సంతృప్తి అనిపిస్తున్నది. రఘోత్తమ్ రెడ్డి సార్ రాసినట్టు ప్రకృతి పరిరక్షణ బాధ్యత, ఒంటి ఆరోగ్యం బాధ్యత రెండూ ఎంతో కొంత నిర్వహించి నట్లు అనిపిస్తున్నది. ( తొట్ల నిర్మాణానికి 18000/ మట్టి, ఎరువు కొని నింపడానికి 7000/ రూపాయల వరకు ఖర్చు వచ్చింది )

No comments:

Post a Comment