Thursday, December 22, 2016

ఇంటిమీదెవుసమ్ 13

                                                             ఇంటిమీదెవుసమ్ 13 .


రెండు రోజులనుండి మొక్కలకు నీళ్ళు ఇవ్వకుండా ఆరబెట్టిన . ఒక రోజు తవటం బెట్టిన , మట్టి మొత్తం ఆర నిచ్చి ఆ తర్వాత నిన్న ఓరలు దొబ్బిన ( మా వైపు దొబ్బడం ఆంటే నెట్టడం ) ..ఓరల  ఫోటో పెట్టిన చూడండి.మొక్కలు అనుకున్న విధంగా పెరుగడం లేదన్న నా బాధను విన్న జయంత్ గారు , వర్మి కంపోస్ట్ నానబెట్టిన నీళ్ళు పోయండి ,సలైన్ ఎక్కించినట్టు ఉంటుంది అని అంటే ఇవ్వాళ ఆ నీళ్ళు పోసిన. చూడాలే మరి !


ఎవుసమ్ 10 పైన స్పందించిన మా చిన్నోని మాటలు తేప తేపకు యాదికొస్తున్నయి . " నీ చుట్టూ ఉన్న పోరాగాండ్లల్ల పోరాగాన్నై, మేం బతుకని బతుకును కండ్ల ముందుంచడం, సూడని తాతను సూపుల్ల నిలుపడం , పొగవట్టిన జొన్న కంకుల వాసన ఇప్పటికీ తాజాగా తన చుట్టూ ఆవరించి నట్టుండడం " . ఆ అనుభవాలన్నీ వాని నోటి నుండి రావడం నాకైతే గొప్ప అనుభూతే ! ఆనందం అయింది కూడా !  ఓ ముప్పైయ్యేండ్ల కిందటి ముచ్చట్లు ఇప్పటికీ పచ్చి పచ్చిగా ఆ మనిషి మస్తిష్కం లో ఎందుకు చిక్కుబడి పోయి ఉన్నట్టు ? ఆ అనుభూతి అతనికి ఎందుకు అంత ప్రీతి పాత్రమైంది? తన పెద్దలు ఆ అనుభవాలు కలిగి ఉన్నందుకేనా? లేక అంతకంటే ఎక్కువైన సామాజిక ప్రయోజనాలు  ఏమైనా ఆ అనుభూతుల వెనుక దాగి ఉన్నాయా ? అపురూపమైన ఆ యాద్ గార్లు, ఇప్పటికీ ఇంకా ఇంకా కావాలని ఏ మనిషైనా ఎందుకు కోరుకుంటాడు? ఏ మనిషైనా  తనదైనది ఏదో పోగొట్టుకొంటినా అన్న దేవులాట తోటి అతని లోపటి మనిషి ఏమైనా తండ్లాడుతడా ? నిజానికి ఈ ప్రశ్నలన్నీ మా చిన్నోని ఆర్తి వెనుక దాగి ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఈ ప్రశ్నలన్నింటికి జవాబులు మొత్తంగా నా వద్ద కూడా లేవు .


మానవ నైజం చాలా చిత్రమైంది. పాతది, ఉన్నది  ఉండాలే , కొత్తది వచ్చేది కూడా రావాలి అని కోరుకుంటుంది. అవును అట్లా కోరుకోవడం లో తప్పు లేదు. కానీ కొత్త ఆవిష్కరణ జరుగాలంటే పాతది విధ్వంసం కాక తప్పది. కానీ ఏ కొత్త ఆవిష్కరణ అయినా పాత దాని పునాదుల పైన్నే నిర్మించ బడుతుందని మరో చోట . నిదానమే ప్రధానం అని ఒక చోట, ఆలస్యం అమృతం విషం అని ఇంకో  చోట. ఇలా పరస్పర విరుధ్ధ సూత్రీకరణలు ఉంటాయి. అయితే మనం మన మన విచక్షణా పరిజ్ఞానం మేరకు ఏది ఎక్కడ అవసరమో అక్కడ వినియోగించుకోవాల్సి ఉంటుంది . .


మన సాంప్రదాయ వ్యవాసాయం వలన భారత దేశం లో పెరుగుతున్న జనాభాకు సరిపోయినంత ఆహార పదార్థాలు పండించలేమని ఎవరో శాశ్త్రాజ్ఞుడు చెబితే మన తాతల తండ్రుల నాటి పద్దతులు మరిచి పోయి పైసలున్నోల్ల బేపారం కోసం తయారైన సంకర జాతి విత్తనాలు, పురుగు మందులు, ఎరువు మందులు తయారు జేసుకున్నం. అవి తినీ తినీ అనారోగ్యాలు తెచ్చుకున్నం . ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళా పాత బాటవడుతున్నం .

విచక్షణ పరిజ్ఞానం ఉండి దాన్ని  ఉపయోగించుకునే పాటి చైతన్యం ఉన్న మన లాంటి వాళ్ళం   కొందరం ఇగో  ఇట్లా  త్రిశంఖు స్వర్గం తీరుగా ఆకాశం లో ఈ   మిద్దె తోటలు పెంచుతున్నాం . విశ్వామిత్రుని వలె ఎంతో పరిజ్ఞానం , పట్టుదల ఉంటేగాని ఈ ప్రక్రియ సాధ్య పడటం లేదు. . దీన్ని ఇలాగే కొనసాగిద్దాం . మనెంట ఓ పది మందిని వెంటేసుక పోదాం. !

No comments:

Post a Comment