Friday, December 30, 2016

ఇంటిమీదెవుసమ్ 16

                                                      ఇంటిమీదెవుసమ్ 16

పాలకూర తింటున్న పురుగులకు  నీమాయిల్ గొట్టిన. దెబ్బకు పురుగులు సచ్చి ఊరుకున్నయ్ .  హమ్మయ్య ! పీఢా వొయింది. నేనింతగనమ్ తండ్లాడి తండ్లాడి పానం తీరుగ పెంచుకున్న పాలకూరను ఇగ దింటరా బిడ్డా ! ఆయ్ ! .

ఇయ్యాల చెప్పే ముచ్చట సదువు బడిల సంగతి కనుక సదువుకున్నోల్ల లెక్క మాట్లాడుకోవాలే గదా ! సరే అట్లనే మాట్లాడుకుందాం ! సరేనా !

ఈ రోజు మా సోదరి రోజా రెటైర్మెంట్ సభకు వెళ్ళిన. ఆమె సోషియల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్. విద్యార్థులు, ఉప్పాధ్యాయులు, బంధుమిత్రులు చాలా పెద్ద సంఖ్యలోనే హాజరైనారు. ఒక పండుగ వాతావరణం కనిపించింది పాఠశాలలో. ఆ సభను ఉద్దేశించి ఒక పూర్వ విద్యార్థి ఉపాధ్యాయ వృత్తి ప్రాశస్త్యాన్ని చాలా గొప్పగా చెప్పాడు. తమ తలిదండ్రులు తమకు మాంసపు ముద్దల్లాంటి దేహాలను  ఇస్తే ,  ఆ మాంసపు ముద్దలను ముద్దార తమ హృదయాలకు హత్తుకొని  మానవీయ మనీషులుగా తీర్చి దిద్దేది ఉపాధ్యాయులు అనీ చెబుతూ  ఇవ్వాళ అందరు గొప్పగా చెప్పుకుంటున్న సొసైటీ కార్య దర్శి గూడా ఒక ఉపాధ్యాయుని వల్లనే అంత గొప్పవాడు అయినాడని చెప్పి అక్కడున్నవారందరి ప్రశంశలు పొందాడు.

ఆ తర్వాత మాట్లాడిన సభాధ్యక్షులు ఆ మాటలకు  స్పందిస్తూ, ఆ అబ్బాయి మాట్లాడిన తర్వాత మా ఉపాధ్యాయులకు ఓహో మేము ఇంత గొప్ప వాల్లమా అన్న ఆలోచన కలిగి ఉంటుందన్నారు. ప్రస్తుతం తమ చుట్టూ ఉన్న పరిస్తితుల వలన మేము ఉపాధ్యాయులమ్ అని చెప్పుకోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నం .అవమాన భారాన్ని అదిమి పట్టుకొని ఆత్మ విశ్వాసం కోల్పోయి మర బొమ్మల వలె పిల్లలకు బోధిస్తున్నాము.  ఉపాధ్యాయుడంటే పాఠాలు చెప్పలేని వాడని, విలువలు లేని వాడని, సంపాదన లేని వాడని మొత్తంగా ఒక గౌరవ ప్రదమైన మనిషే కాదనే భావం సమాజం
లో  బలపడే విధంగా పాలకులు స్తిరీకరించారు.

ఒక విద్యార్హిని భవిష్యత్తులో నీవు ఎమౌదామనుకొంటున్నావని అడిగేతే , " నేను, ఐ పి ఎస్, ఐ ఏ ఎస్ , డాక్టర్ , ఇంజనీర్, అయితే పోలీస్ అంటున్నాడు గాని ఒక్క పిల్లవాడైనా నేను టీచర్ ను అవుతానని అనడం లేదు. ఎందుకు? కానీ నిజానికి ముఖ్యంగా ఏ సమాజానికి ఐనా ముఖ్యంగా ముగ్గురు తక్షనావసరంగా ఉంటారు. ఒకరు ఆకలికి అన్నం పండించే రైతు,రెండు  బార్డర్ పైన ఉండి అందరికీ భద్రతనిచ్చే సైనికుడు, మూడు జ్ఞాన నేత్రం తెరిపించి బతుకు దెరువు నేర్పే గురువు. కానీ ఇవ్వాళ ఆ వృత్తే చులకనై పోయింది. ఈ అబ్బాయి లాంటి వాళ్ళు ఇలా గుర్తు జేస్తే ఓహో మేము గురువులమే కదా అని గుర్తుకొస్తున్నది .

ఈ పరిస్తితి మారాలి. లేకుంటే ఈ బడులళ్లనుండి విలువలు లేని, సమాజాన్ని పట్టి పీడించే దొంగలు బైటికి వస్తారు. అప్పుడు ఈ రాజ కీయ నాయకుడు దేశాన్ని దోచుక తింటున్నాడని అన్నా, ఒక డాక్టరు కడుపులు కోసి ప్రాణాలు తీస్తున్నాడని అన్నా, ఈ ఇంజనీరు కూలిపోయే భవనాలు, ప్రాజెక్టులు కట్టి ప్రజల ఉసురు తీస్తున్నాడని అన్నా, ఈ బ్యూరోక్రాట్ పెద్ద లంచగొండి అని అన్నా. ఈ ఐ పి ఎస్ నకిలీ ఎంకౌంటర్లు చేసి ప్రజలను చంపుతున్నాడని గొంతు చించుకున్నా గోల చేసిన ప్రయోజనం ఉండదు. ఆదర్శవంతులైన ఉపాధ్యాయులకోసం, సమాజాహితమైన చదువుల కోసం నిజాయితీ గా కృషి జరుగలన్నాడు.

తమ సంతానాలకు పెద్ద పెద్ద చదువులు కొని పెడుతాము , ఆ వెంటనే వాళ్ళు పెట్టిన పెట్టుబడి పోను ఇబ్బడి ముబ్బడి గా లాభాలు తెచ్చే డబ్బు మిషన్లు గా ఎదుగాలని తలిదండ్రులు ఎంతవరకైతే  కోరుకుంటారో అంతవరకు ఈ  సమాజానికి శ్రేయస్కరం జరుగదు. తమ పిల్లలు ఏ వృత్తిలో స్తిరపడ్డా ఫరువా లేదు, ఎంత సంపాదించినా ఫరువా లేదు కానీ వారు మనుసున్న మనుషులు గా ఎదుగాలన్న బలమైన ఆకాంక్ష తలిదండ్రుల్లో వచ్చినప్పుడే ఏ సామాజానికైనా నిష్కృతి అని ముగించాడు.


No comments:

Post a Comment