Thursday, December 22, 2016

ఇంటిమీదెవుసమ్ 11

                                                                ఇంటిమీదెవుసమ్ 11

మా సర్కస్ రింగ్ మాస్టర్ ( ఎనుకటి మా పెద్ద సారు తీరుగ ) కొరడా చడేల్ మనిపిచ్చిండు. అర్రెర్రే ఎనుకబడి పోతినా అని పొద్దుగాల యోగాసనాలు కాంగానే ఇగో ఇట్లా మొదలువెట్టిన . .ఇయ్యాల ఎవుసమ్ పని గూడ లేదు. ఈ సలి మంచు జెయ్యంగా తడి ఎక్కువై తున్నదని మడులను ఆరవెట్టి తవుటమ్ బెట్టిన  . ఇండ్ల ఈ కంప్యుటరొకటి సతాయిస్తున్నది ..

మా చిన్నప్పుడు మంతెనలకు ఓ సర్కస్ వచ్చుండే. అండ్ల రింగు మాస్టర్  గుండ్రటి సర్కిల్ ల హంటర్ వట్టుకొని ఉండేటోడు . తెల్లటి , ఎర్రటి , నల్లటి నాలుగైదు గుర్రాలు పరిగెత్తుకుంట వచ్చేటియి . రింగు మాస్టర్ హంటర్ చడేల్ మని కొట్టంగనే రింగు బయిట ఉన్న కర్ర ట్రాక్ మీది నుంచి జోరు తోటి గుర్రాల ఉరుకుడు మొదలయ్యేది. ఒక పొట్టి గుర్రం ట్రాక్ మీద కాసేపు ఉరికినట్టు జేసి రింగు మాస్టర్ తనను చూడనప్పుడు ట్రాక్ దిగి కింది నుంచి ఉరికేది . రింగు మాస్టర్ హంటర్ దీసుకోని దానెంట వడంగానే  ఆయనకు అందకుంట ముందుకు ఉరికి పోయి  ట్రాక్ ఎక్కేది. అది మళ్ళా మళ్ళా అట్లనే జేసేది . మేం పొరగాండ్లమంతా ఆ దొంగ గుర్రం ఎప్పుడు దిగుతదా అని చూసుకుంట అది ట్రాక్ దిగంగానే ఓ ఓ అని మొత్తుకుందుం . మా లొల్లికి హంటర్ మాస్టర్ వచ్చేకంటే ముందే అది ట్రాక్ ఎక్కేది.  దిగేది , మొత్తుకొంగనే ఎక్కేది మాకది ఓ గొప్ప ఆనందమిచ్చిన గుర్రం, పోరగాండ్ల ఆట.  తర్వాత తేలింది మాకు , పొల్లాగాండ్లను రప్పించే తందుకే ఆ గుర్రానికి అట్లా తర్ఫీద్ ఇచ్చిండ్రని.

నిన్న రఘోత్తమ్ రెడ్డి సార్ తోటి మాట్లాడిన తర్వాత రాసేది రాయవల్సింది చాలా ఉన్నదని  మల్లోసారి యాదికి వచ్చింది. మేము గూడా ఆకుల భూమయ్య సారుతోటి చాలా సార్లు చెప్పేటోల్లమ్ మీరు రాయండి సార్, రాయాలి సార్  అని. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆయన చాలా విషయాలు బిగ్ బ్యాంగ్ థీరి నుండి మొదలువెడితే దైవ కణం దాకా అరిటీ పండు ఒలిచి పెట్టినట్టు చెప్పేటోడు . ఆయన్ను మేమంతా నడిచి వస్తున్న పుస్తక భాండాగారం అందుము.ఆయన చెప్పే విషయాలు చాలా అథారిటేటివ్ గా సైంటిఫిక్ గాఉండేటియి . మీరు చెప్పేవి అన్నీ రికార్డ్ అయితే సమాజానికి చాలా ఉపయోగం అని మేము ఆయనతో అనేక మార్లు అనే వాళ్ళం .  రాద్దామ్ రాద్దామ్ అని చెప్పేటోడు. కానీ ఎల్లుండి డిసెంబర్ 23 న ఆయన 3 వ వర్దంతి.

No comments:

Post a Comment