Thursday, December 22, 2016

ఇంటిమీదెవుసమ్ 12

                                                               ఇంటెమీదెవుసమ్ 12

ఇంటిమీదెవుసమ్ ల ఇత్తునాల్ వెట్టి నెల రోజులకచ్చింది. ఆకు కూరలు కంచం ల కొచ్చినయ్ గాని తీగ జాతులింకా తీగ సాగుత లెవ్. ఈ సలి కాలం పాపం వాటిని సాగనిస్తలేనట్టున్నది . ఓ తీగ సాగుతున్న ముచ్చట జెప్పుత సదువుండ్రి .

ఎవుసమ్ 10 సదివినంక చాలా మందే మాట్లాడిండ్రు. మా పిల్లలిద్దరు కూడా దక్కన్న రాజ్యం నుంచి సంబుర పడుకుంట వాళ్ళకు ప్రకృతి తోనున్న సంబంధం గురించి  రాసిండ్రు. అట్లనే మా పెద్దల్లుడు బుర్ర తిరుపతి గూడా రాసిండు. రఘోత్తమ్ రెడ్డి సారు తిరుపతి మీద కైతికాలు గూడా రాసిండు. ఈ సిల్ సిలా (పరంపర) మీద గూడా మనం రాయొచ్చు అని రఘోత్తమ్ రెడ్డి సార్ చెప్పిన తర్వాత ఇయ్యాల ఇదే ముచ్చట జెప్పుదామని రాస్తున్న.

చెప్పిన గదా! మాదో చిన్న పల్లెటూరని, పంట పొలాలున్న ఎవుసమ్ దార్ల కుటుంబమని. మా నాయిన తెలివి తోటి నన్ను డిగ్రీ చదివిచ్చిండు,దాంతోటి బడి పంతులు నౌకరొచ్చింది ఉన్నూరి పక్కన్నే. బడి, ఇల్లు ఎవుసమ్ నా ప్రపంచం.  పిల్లలను సేను సెలుకల పొంటి తీసుక పోతుంటి. భూముల గురించి పంటల గురించి వాళ్ళకు చెప్పేటోన్ని . సమాజం లో అనేక మార్పులు జరుగుతుంటాయి. మనం  నడిచి వస్తున్న దారి నేర్పిన అనుభవం  మేరకు  మనం వాటికి అనుకూలంగానో  ప్రతికూలంగానో మనిషిగా మాట్లాడకుండా ఉండలేము. అట్లా మాట్లాడి నందుకే ఒక్క నూకుడు నూకుతే ఇగో ఇట్లా కరీంనగర్ ల వచ్చి పడ్డ. ఇక్కడికి వచ్చినంక గూడా బడి, సంఘం అంట బాగనే తిరిగిన.  పిల్లల చదువుల గురించి పెద్దగా పట్టించుకున్నది ఏమి లేదు. కానీ సమయం చిక్కినప్పుడల్లా వాళ్ళను చుట్టూ కూచుండ బెట్టుకొని మా ఊరి ముచ్చట్లు, మా నాయిన కాలం నాడు వాళ్ళు కుటుంబాల కోసం ఎట్లా కస్టపడేదో , నేను గూడా ఐదో తరుగతి కాంగానే చిన్నతనం ల మా ఊరు నుంచి మంతెన కు వచ్చి వండుక తినుకుంట ఎట్లా ఇబ్బంది వడి సదువుకున్ననో చెప్పుతుంటి. నాకు వచ్చే జీతం  ఎంతో గూడా చెప్పేటొన్ని. దీంతో నా పిల్లలు ఎప్పుడు గూడా నాకు ఇది గావాలే అది గావాలే అని నన్ను ఒక్క నాడు గూడా ఇబ్బంది పెట్టక పొదురు . ( ఇప్పటి పిల్లల సంగతి జూస్తే అస్సలు పొలికే లేదు) .

ఓ సారి మా పెద్దోడు నేను మంతెన పక్కనున్న గోదావరి  ఔతలి ఒడ్డుకున్న మా అక్కోల్ల ఊరు పౌనూరుకు పోయినమ్. బాగా వర్షం పడ్డది. మేము తిరిగి మంతెనకు రావాలే . గంగోడ్డుకు వచ్చేవారకు గోదారి నిండుగ పారుతున్నది . మావోని ప్రశ్నలు జూడాలే ! ఈ నీళ్ళు ఎక్కడియి, వానన్టేంది , నీళ్ళు  ఎందుకు అటు ఉరుకుతున్నయి , ఇటెందుకు ( వెనుకకు ) రావు. నీళ్ళ మీది నుంచి మనం ఎదుకు నడిచి పోలేము, ఓడ అన్టేంది , అండ్లెక్కితే ఎందుకు మునుగమ్ మరి, ఇట్లా అనేక ప్రశ్నలు . ఓపికగా ఆన్నింటికి జవాబు చెప్పి ఇంటికి వచ్చినం . పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు ఏమ్మాట్లాడుకున్నారో గాని అబ్బా! మా నాన్నకు తెలిసినంత  ఈ బూమ్మీద మరెవ్వనికి తెలువది అన్న అభిప్రాయానికి వచ్చినట్టు ఆ తర్వాత నా చిన్న బిడ్డ జెప్పితే నాకు అర్థమయింది. ఎవ్వరికైనా నాన్నే తొలి గురువు అని ప్రాక్టికల్ గా నాకు అప్పుడు అర్థం అయింది. నా చిన్న బిడ్డ జవహర్ నవోదయ చొప్పదండి లో చదువుకునేది. ఆమెను ప్రోత్సహించే కొరకు చదువు, ప్రవర్తన, విలువల గురించి నాకు తోచినప్పుడల్లా ఉత్తరాలు రాస్తుండే వాణ్ని . ఆ ఉత్తరాలను తాను ఒక్కతే గాకుండా మిత్రులందరితో కలిసి చదువుకొనేదాట . మొన్న జులై నెలలో నేను తన వద్దకు పోయినప్పుడు ఆ విషయం గుర్తు జెసి ఆ ఉత్తరాలు ఇప్పటికీ తన నగల తో బాటుగా దాచుకున్నానని చెపితే నా కళ్ళల్లో నీళ్ళు ఊరినై .

రెన్డేండ్ల  కింద ఒక సారి నేను మా చిన్నోని దగ్గరికి పోయిన . అప్పటికి వాణ్ని చూడక మూడేన్ద్లు అయితాంది . . వాణ్ని చూడంగానే ఎక్కణ్ణుంచో చెప్పరాని దుఃఖం ముంచుకొనచ్చింది , వాణ్ని పట్టుకోని కడుపుల సొద కరిగి పోయేదాకా ఏడ్చిన . వాని కళ్ళల్లో గూడా కన్నీళ్లు. ఈ నీళ్లూరుడు కరిగి పోవడాలు లేకుండా ఉంటే మనుషులు మంచుగడ్డల్లాగా బిర్ర బిగుసుకొని ఉంటే మానవ నాగరికత ప్రేమ ఆప్యాయాలతో ఇలా సజీవ స్రవంతి లాగా ఉండజాలదేమో . మనుషుల మధ్యన ఈ సంబంధ బాంధవ్యాలు , ప్రేమానురాగాల పెనవేత ఎంత బలంగా ఉంటే కుటుంబ సంబంధాలు అంత బలంగా ఉంటాయి. కుటుంబాల వ్యవస్త ఎంత బలంగా ఉంటే సమాజాల జీవన శైలి అంత బలంగా ఉంటుంది. కనుక మనిషి ప్రథమంగా తనను తాను ప్రేమించుకోవాలంటే తాను ఆరోగ్యంగా ఉండాలి. అందుకు అవసరమైన ఆహారం, శారీరక శ్రమ చేయాలి. తనతో మొదలిడిన ప్రేమ తన పరిసరాలను , పక్కవాళ్లను నచ్చుకుంటూ , మెచ్చుకుంటూ విశ్వ వ్యాప్తం కావాలని ఆశిద్దాం.!

No comments:

Post a Comment