Tuesday, December 13, 2016

ఎవుసమ్ 7

                                                                       ఎవుసమ్ 7

ఈ రోజు ఉదయం నేను నా మిత్రుడు నాగేందర్ సార్ కల్సి మొక్కలకు నీళ్ళు పెడుతున్నం,  అప్పుడే పాత్రికేయ మిత్రుడు కరుణాకర్ గారు పోన్ జేసి మీరు పెంచుతున్న కూరగాయల తోట చూసి వార్త రాద్దామనుకుంటున్నాను ఇంట్లో ఉన్నారా అని అడిగిండు. ఆయనకు సాదరంగా స్వాగతం చెప్పిన. ఆయన రాసే వార్త వలన ఒక్కరు స్పూర్తి పొంది నా ప్రకృతికి మేలు జరిగి ఆయనకూ  ఆరోగ్యం చేకూరుతుంది గదా అన్న ఆశ తో . కరుణాకర్ గారి సోపతి జీవ గడ్డ పత్రిక నడుస్తున్న నాటి నుండి ఉంది. ఆయన ఇంటికి వచ్చి విజయ కుమార్ సార్ ఉన్నప్పుడు వచ్చిన్నంటే మళ్ళా ఇప్పుడే రావడం అని జీవ గడ్డ విజయ్ కుమార్ ను యాదికి తెచ్చిండు.

1970 ల నుండి కరీంనగర్ ల నిర్మల ప్రింటింగ్ ప్రెస్ ల విద్యుల్లత పత్రిక అచ్చు అయ్యేది. మిత్రుడు నాగేందర్ నేను ప్రెస్ కు  పోయినప్పుడు ప్రూఫ్ రీడింగ్ చూస్తుంటిమి .1970  నుండి 1973 దాకా మేము కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ డిగ్ర్ర్ కాలేజ్ ల చదువుతుండే వాళ్ళం .  మాకు మంథని లో ఉన్నప్పుడు లైబ్రరీ కి వెళ్ళి పుస్తకాలు చదివే వ్యసనం బాగా ఉండేది కనుక విద్యుల్లత పత్రిక మాకు పెద్ద చెరుకు గడ దొరికి నట్టే ఉండేది. అక్కడనే మాకు " సృజన " తో పరిచయం అయింది.అప్పటి దాకా గాంధీ మహాత్ముడే ఇంగ్లీషోళ్లతోటి  కొట్లాడి దేశానికి స్వాతంత్రం తెచ్చిండాని నమ్మేటోల్లమ్ . ఈ పత్రికలను చదివిన తర్వాతనే మాకు దేశం కోసం ఎవరవరు ఎట్లా త్యాగాలు చేసిండ్రో అర్థం అయ్యింది.

కరుణాకర్ గారు టీ పాయ్ మీద ఉన్న " ఇంటి పంట " పుస్తకం చేతి లోకి తీసుకొని మిద్దె తోటలు పెంచే కాన్సెప్ట్ ను ఇక్కడ  ఈ సారే మొదలు పెట్టిండా అని రఘోత్తమ్ రెడ్డి సారు పోటో చూపుతూ అడిగిండు. నాకు తెలిసి అయితే రఘోత్తమ్ రెడ్డి గారు ఆరేడు యేండ్ల నుండి ఈ కృషి చేస్తున్నాడు. అంతకు ముందు ఎవరైనా చేస్తే చేసి ఉండవచ్చు . కానీ ఈయన వల్ల , ఆయన రాస్తున్న రాతల వలన జనం లో బాగా ప్రాచుర్యం లోకి వచ్చిందని చెప్పిన .మిద్దె తోటల గురించిన వార్తలు రాయడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగ పడుతుంది కనుక  ఈ పుస్తకం నేను తీసుక వెలతా అన్నారు. వాస్తవానికి ఆ పుస్తకాలు సూదమ్ రమేశ్ గారని మన మిద్దె తోట మిత్రుడు నిన్న  నే  కరీంనగర్ లో ఉన్న మిద్దె తోట సేద్యకారులకు ఇవ్వుమని రఘోత్తమ్ రెడ్డి సార్ పంపించినాడని ఇచ్చి పోయిండు . సరే పాత్రికేయుని చేతిలో పడితే పది మందికి అందులోని సమాచారం వెళ్తుందన్న ఆశతో ఆ పుస్తకం వారికి ఇచ్చాను, పంపిన వారి అనుమతి లేకుండానే.


మిద్దె తోట లో పెట్టిన బీర, సొరకాయ, కాకరకాయ విత్తనాలు మొలకెత్తి చాలా రోజులే అవుతున్నా కూడా తీగలు ఇంకా వేయడం లేదన్న ఆతృత  నాలో. చలికా , లేక ఎరువు ఎక్కువయ్యిందా ఏమైనా అనేది నా ఆతృతకు కారణం. నా ఆతృత కాక పోతే దానికి ఆ వయసు రావద్దూ ? నాలోకి నేనే ఒక సారి తొంగి చూస్తే ఈ తరం తలిదండ్రులు ఎలాగైతే తమ పిల్లలకు మూడేన్లు దాటక  ముందే ముద్దార చదువక పోతున్నారే అని ఆన్ధోలన చెందినట్టుగానే నేనూ ఆలోచిస్తున్నాను  కదా అనిపించింది. ఎందుకు నేను ఇట్లా ఆలోచిస్తున్నానా అని అవలోకిస్తే , నేను ఓ రెండు వేలు పెట్టి నిలువు పందిరి చేయించినా కదా ? మరి ఆ పందిరికి ఈ తీగలు ఎక్కాలి కదా ?ఇంకా ఎప్పుడు ఎక్కుతాయన్న ఆన్ధోలన ,  ఓహో ! ఇదన్న మాట ఆంతర్యం. సాధ్యమైన కాడికి ప్రకృతి వనరులను పిండి పిప్పి జేసి కూడబెట్టిన సంపాదన వినియోగం లోకి రావాలి కదా?  అందునా తన సంతానానికి దక్కాలన్న స్వార్థంపు ఆలోచనకు నాందే అన్నీ తొందరగా ఎదుగాలన్న , అన్నీ తొందరగా అనుభవించాలన్న ఆలోచనలకు కారణం అనిపించింది. ప్రకృతి ప్రేమికులు గా, ప్రకృతి పరిరక్షకులు గా పండకుండానే , పండించ కుండానే , ఫలితం అనుభవించడం నేరం కదా ? పండించ కుండానే అంటే నా భావం , ఉత్పత్తి లో భాగం కాకుండానే  అని అర్థం . అందుకని ఎవరికి వాళ్ళం ఎంతలో కొంతైనా ఉత్పత్తిలో భాగం అవుదాం రండి !

No comments:

Post a Comment