Friday, December 23, 2016

ఇంటి మీదెవుసమ్ 14

                                                      ఇంటిమీదెవుసమ్ 14


ఎన్ని ఇకమాతులు జేసినా అస్ నీ ! అటేటే , అంటానయి మొక్కలు గాని కాసంతన్న పండ్లిగిలిత్త లెవ్ ,పగులవడి నవ్వకుంటే మానాయే గాని అన్నా సుత ! పాసిపోయిన మొఖాలేసుకొని మొక్కలన్నీ అట్లనే బిర్రబిగుసక పోయ్యున్నై . ఎందుకీటికి గింతనన్న నెనరు లేకపాయే , నేను ఇంత పోదన జేస్తున్న గూడా అని మనుసు మదన వడుతున్నది . పాయే నెల రోజులు గడిచి పాయే . నీ మిద్దె తోట ఎట్లున్నదో సూద్దామని దోస్తులు రావట్టిరి . . ఇయ్యాలనే మా సుబ్బా రావ్ సార్ గూడా వచ్చిండు హన్మకొండ నుంచి. కానీ సూడ వొతే ఏమున్నది , ఊరి బైటి బోడ గుట్టల తీరుగ  కాయ లేని పువ్వు లేని కాకిరి బీకిరి శెట్లు . ఒక్క సారి మళ్ళా సిన్నప్పటి ఎవుసమ్ ముచ్చట యాదికి దెచ్చుకున్న.


కరీంనగర్ జిల్లా మంతెన మాదేపూర్ తాలుకాల ఉత్తరం దిక్కు గోదావరి నది పడుమటి నుండి తూర్పుకు పారుతుంటడి , మరో దిక్కు మంతెన మాదేపూరాన్ని వేరుజేసుకుంట మానేరు నది దక్షిణం నుంచి ఉత్తరానికి పారుతుంటది .ఒక వైపు కాటారం మండలం దామెరకుంట, మరో వైపు చెన్నూరు మండలం పొక్కూరు వద్ద మానేరు గోదావరి నదిల కలుస్తది .  అప్పట్ల ఇవి రెండూ  ఏడాదొకి పెన్నెండు నెల్లూ పారుతూనే ఉండేటియి తియ్యటి నీళ్ళ తోటి. దసర పండుగు వరకే   తెల్లజొన్న పోతలు అయ్యేది. అప్పుడు అంతా తెల్ల జొన్న చేన్లే . సత్తెపు పంట అందురు. ఒక్కొక్కటి ఇసుర్రాల్లంత ,  ఇసుర్రాల్లంత పెల్లలు , ఆ  పెల్లల్ల జొన్నలు వొస్తే , వానలు పడ్డా పడక పోయినా సల్ల ముంతలంత సళ్ళముంతలంత కంకు లు వెట్టేటియి కర్రలన్నీ. ఇగ నీళ్ళ వసతి ఉన్న కాడ మక్కజొన్నలు వేద్దురు . అప్పుడు మా ఉర్లే నాలుగు కుటుంబాలకే బావులు ఉండేటియి. ఈ రెండు నదుల నడుమ భూమి ఎండ గొడితే బర బర , వాన గొడితే బుర్ద, బుర్ద, . అయితే మా బాయి కి మోట వెట్టి మా నాయిన అప్పుడు మా ఊల్లే కొత్తగా మక్క జొన్నలు పెట్టిండు. మక్క జొన్నలు తియ్యగ ఉంటయని అవి తింటే వాతం అని వ్యవసాయ కూలీలు కైకిలికి (కూలికి ) మక్కలు తీసుకోక పోదురు . అప్పటికి మక్క జొన్న సాగు అధునాతనమైందన్న మాట .


ఇత్తునాలు మా నాయిన పుట్టినూరైన కల్వచెర్ల ( కమాన్ పూర్ మండలం ) నుండి తెచ్చిండట . సంకరం కాని విత్తనాలు , సారవంతమైన నేల ల సాలినంత పశువుల ఎరువు వేసిన భూమిల విత్తనాలు నాటేది . ఇక్కడ కూడా పెద్ద పెద్ద పెల్లలు ఉండేది. గోడ్డండ్లు వట్టి పెల్లలను మెత్తగా నలుగ గొడుదుము . అట్లా మెత్తగైన నేలల జానేడు జానేడు దూరం ల ఒక్కొక్క గింజ నాటుదుము . నాటినంక పాయలు దీసి ఓరలు గుంజి , కాలువలు జెసి నీళ్ళు గట్టెటిది . తెల్లారంగా పుంజులు గూసే యేళ్లకు మోటలు గడితే బాయిల నుంచి గోరెచ్చటి నీళ్ళు మోట బొక్కన నిండా వచ్చేటియి . మోట గొట్టుడు షురూ అయినంక కాలువ సాగే వరకు ఉడుకుడుకు మోట నీళ్ళ తోటి మొఖం గడుక్కోని , గప్పుడే సంటి నుండి మా నాయిన విండిన నురుగులు గక్కే గోరెచ్చటి  పాలు , ఇత్తటి పాల సర్వల నుంచి కంచు గిలాసల , గిలాస నిండ వొసిత్తే , కమ్మగ దాగి పెయ్యంత యెచ్చ జేసుకొని అగో గప్పుడు గాని నీళ్ళు గట్టెతందుకు మక్క తోటలకు పోక పోదుము .


మక్క పెరటిల ఉన్న పెల్లలు ఒరుసుక పోయి కాళ్ళ యేళ్ళ కు నెత్తుర్లు గారేది అప్పుడప్పుడు. మక్క కర్రల మీద రాత్రి కురిసిన మంచు తోటి  తడిసిన మక్క కర్రల ఏనెలు,  సెంపల పొంటి ఒరుసుక పొయ్యి బగ బగ మండుతుండే సెంపలు . పెల్లల కింద బతుకు జీవుడా అని దాక్కొనున్న తేలు పిల్లల్లు మోట నీళ్ళు తాకంగానే పెల్లల్ల నుంచి బైటికి వచ్చేటియి . అప్పుడప్పుడు కాళ్ళ పొంటి మీదికి ఎక్కేటియి .దెబ్బకు సలి దెంక పోతుండే .  తేలు కుట్టినట్టు మాత్రం యాదికి లేదు. అంత కస్ట పడి పంట దీసిన మనం గీయింత పడావు జేసె ఫలితం రాక పాయే గదా అని నీరస పడితే యెట్లా అని నాకు నేనే సమ్జాయించు కుంటున్న .


No comments:

Post a Comment